కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న తన పాలన కన్నా.. మళ్లీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం కన్నా కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందన్నట్లుగా కేసీఆర్ ప్రచారం చేశారు. అయితే ఆయన ఓటమితో అదో ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీగా మారిపోయింది. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో అదే స్ట్రాటజీ అందుకుంటున్నారు. చంద్రబాబునే బూచిగా చూపించి ఆయన వస్తే.. ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రొద్దుటూరు, నంద్యాల సభల్లో ప్రసంగించారు. రెండు సభల్లోనూ తాను 130 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్నదానికన్నా చంద్రబాబు గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
సుమారుగంటన్నర పాటు సాగిన ప్రసంగాల్లో చంద్రబాబు ప్రస్తావన ప్రతీ నిమిషానికి వినిపిస్తూనే ఉంది. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని.. ఆయన జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు అంటూ ప్రసంగించారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా?. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాన్నాడు.. చేశాడా?. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు? మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్‌కో వస్తుందని చెబుతున్నారు. చంద్రబాబు వస్తే చంద్రముఖి లకలక మంటూ వస్తుందని.. పథకాలు ఆగిపోతాయని.. రక్తం తాగేస్తారని … జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.
చంద్రబాబు వస్తే ఇంటింటికి పెన్షన్ రాదని… ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇక్కడ జగన్‌కు.. కేసీఆర్ ఉన్నంత విస్తృతమైన అవకాశాలు లేవన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే కేసీఆర్ పదేళ్లలో తెలంగాణలో గుణాత్మకమైన మార్పునూ చూపించారు. రోడ్లు, మంచినీరు వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పు చూపించారు. పాలన విషయంలో ఆయనపై ఉన్న రిమార్క్స్ తక్కువ. కేవలం అధికార దుర్వినియోగం.. అహంకారం కారణంగానే ఆయన ఓడిపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు వస్తే.. అన్నీ ఆగిపోతాయని చెప్పే విస్తృతమైన అవకాశాలు లేవు. ఎవరు వచ్చినా ఉండే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఒక్కటే మార్గం. జగన్మోహన్ రెడ్డి దాన్నే గట్టిగా ఉపయోగించుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. టీడీపీ మేనిఫెస్టోకూ ఆయన తన ప్రసంగాల్లో చోటు కల్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలు అమలు చేయలేదని చెప్పడమే కాదు.. కొత్త మేనిఫెస్టో అమలు చేయడానికి లక్షల కోట్లు కావాలని.. తాను అమలు చేస్తున్న పథకాలే జబ్బులు తేవడానికి తంటాలు పడుతున్నానని చంద్రబాబు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇది నెగెటివ్ కోణంలో అియనా టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం చేసినట్లవుతుందన్న అభిప్రాయం ఉంది. అమరావతి ఆపేస్తారని.. పోలవరం ఆపేస్తారని.. రోడ్ల నిర్మాణం ఆపేస్తారని.. తాను తీసుకు వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి పంపేస్తారని.. ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. పథకాలు ఆగిపోతాయన్న అభిప్రాయం బలంగా కల్పించానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వం మారినా సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వ పథకాల అమలులో ఇప్పటికే జగన్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ.. నొక్కిన బటన్లను డబ్బులు పడలేదు. ఈ అంశంపై లబ్దిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికే అప్పుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగాచర్చ జరుగుతోంది. విపరీతంగా అప్పులు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ మెళ్లీ గెలిస్తే.. పన్నుల పెంపు తప్పదన్న ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. అయితే .. తాను రాకపోతేనే ఆగిపోతాయని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో ఎన్నికల ఫలితాలే తేల్చాల్సి ఉంది.