ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో మరో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోట్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో మంత్రినీ విచారిస్తుండడం సంచలనమవుతోంది. నజఫ్‌గర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కైలాశ్ గహ్లోట్ లిక్కర్ పాలసీ రూపొందించిన ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పాలసీని రద్దు చేసినప్పటికీ…భారీ అవినీతి జరిగిందంటూ ఈడీ తేల్చి చెబుతోంది. ఈ స్కామ్‌తో గహ్లోట్‌కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఈడీ ఆరోపణల ప్రకారం…ఈ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్‌ని సౌత్ గ్రూప్ కి లీక్ చేశారు. లిక్కర్ పాలసీని రూపొందించే సమయంలో ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ గహ్లోట్ ఇంట్లో ఉన్నారని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాదు. కైలాశ్ గహ్లోట్ పదేపదే మొబైల్ నంబర్స్ మార్చడంపైనా అనుమానం వ్యక్తం చేస్తోంది.
మార్చి 28వ తేదీన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ని కోర్టులో హాజరు పరిచారు. ఏప్రిల్ 1వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేలా అనుమతి తీసుకుంది ఈడీ. కేజ్రీవాల్‌తో పాటు మరో ఇద్దరు ఆప్ నేతలూ ఇప్పటికే ఇదే కేసులో జైల్‌లో ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరుతో భారీ ఎత్తున వీళ్లంతా మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ తేల్చి చెబుతోంది. కొంత మందికి లబ్ధి చేకూర్చే విధంగా పాలసీని తయారు చేయడమే కాకుండా వాళ్ల నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఈడీ చెబుతోంది. అయితే…ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ పాలసీలో అవకతవ కలున్నాయని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ తరవాతే ఇదంతా బయటపడింది.