జాతీయం ముఖ్యాంశాలు

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం

ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులకు అనుమతి

క‌రోనా రెండో దశ విజృంభణ తర్వాత తొలిసారిగా శ‌బ‌రిమ‌ల‌ అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు తెల్ల‌వారుజామున భ‌క్తుల ద‌ర్శ‌నార్థం తెరిచారు. అనంత‌రం సుప్రభాత, ఇత‌ర సేవ‌ల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. క‌రోనా ప‌రిస్థితుల నేపథ్యంలో ప‌రిమిత సంఖ్య‌లోనే భ‌క్తుల‌ను అనుమతిస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చెప్పింది. అలాగే, క‌రోనా టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకొచ్చిన వారికే అనుమ‌తి ఉంటుందని, దర్శనానికి వచ్చే వారు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ఇప్ప‌టికే ఆన్‌లైన్ బుకింగ్ సౌక‌ర్యాలు క‌ల్పించారు. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న‌ వారికి అవకాశం కల్పిస్తున్నారు.

కాగా, గ‌త ఏడాది కూడా క‌రోనా తొలి దశ వ్యాప్తి అనంత‌రం మండల, మకరు విలక్కు పూజలకూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన విష‌యం తెలిసిందే. కేర‌ళ‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అధికారులు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.