ఎన్నికల నేపథ్యంలో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దాదారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రఘువీరారెడ్డి, జేడీ శీలం, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను హస్తం అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారని సమాచారం.
కడప బరిలో షర్మిల
కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ దాదాపు ఖాయమైంది. బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ – పల్లంరాజు, రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, విశాఖపట్నం – సత్యారెడ్డి, ఏలూరు – లావణ్య, అనకాపల్లి – వేగి వెంకటేష్, శ్రీకాకుళం – పరమేశ్వరరావు (డీసీసీ ప్రెసిడెంట్), విజయనగరం – రమేష్ కుమార్ (డీసీసీ ప్రెసిడెంట్), రాజంపేట – నజీం అహమ్మద్, చిత్తూరు – చిట్టిబాబు, హిందూపూర్ – షాహీన్, నరసరావుపేట – అలెగ్జాండర్, నెల్లూరు – దేవకుమార్ రెడ్డి, ఒంగోలు – సుధాకర్ రెడ్డి, మచిలీపట్నం – గొల్లు కృష్ణ పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. మంగళవారం ఖరారైన అభ్యర్థుల జాబితాను మంగళవారం (ఏప్రిల్ 2) అధికారికంగా ప్రకటిస్తామని షర్మిల స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.అటు, తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. అతి త్వరలోనే ఈ స్థానాలపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు, తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది.
ఇంఛార్జీలు వీరే
1. ఖమ్మం ఇంఛార్జీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి
2. నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
3. కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
4. పెద్దపల్లి – శ్రీధర్ బాబు
5. మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వరరావు
6. వరంగల్ – ప్రకాష్ రెడ్డి
7. హైదరాబాద్ – ఒబేదుల్లా కొత్వాల్
8. సికింద్రాబాద్ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
9. భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
10. చేవెళ్ల – నరేందర్ రెడ్డి
11. నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
12. మెదక్ – కొండా సురేఖ
13. నిజామాబాద్ – సుదర్శన్ రెడ్డి
14. మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
15. ఆదిలాబాద్ – సీతక్క
16. జహీరాబాద్ – దామోదర రాజనర్సింహ
17. మహబూబ్ నగర్ – సంపత్ కుమార్ లను ఇంఛార్జీలుగా నియమించింది