రాష్ట్రపతి రేసులో పవార్ ఉన్నారనే వార్తలు
ప్రధాని మోడీ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడి నివాసానికి శరద్ పవార్ వెళ్లారు. వీరిద్దరి సమావేశం దాదాపు 50 నిమిషాల సేపు కొనసాగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉండబోతున్నారని… ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని పవార్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మోడీతో పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.