ఎన్నికల్లోనే కాదు… రైతు సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీపోటీ పడుతున్నాయి. ఎండిన పంటలు, రైతు సమస్యలు, నెరవేరని కాంగ్రెస్ హామీలే ప్రధాన ఎజెండాగా ఆ రెండు పార్టీలు పోరుబాట పట్టాయి. భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోయిన పంటలకు ఎకరాన 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ తో బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళనలకు వారం రోజుల ప్రణాళిక ప్రకటించాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికల్లో ఆచితూచి అడుగులు వేస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్దమై నిరసన కార్యక్రమాలు పోటాపోటీగా చేపడుతున్నాయి.బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తప్ప, తేమ పేరుతో తరుగు లేకుండా ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయించడమే లక్ష్యంగా పోరాడుతామని సంజయ్ తెలిపారు.
అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బస చేయాలని నిర్ణయించారు. ‘రైతు దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని బండి సంజయ్ కోరారు. రాజకీయాలను, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.భూగర్భజలాలు అడగండి పుట్టేడు కష్టాల్లో ఉన్న రైతులకు మనోధైర్యం కల్పించి ఎండిపోయిన పంటలకు తగిన పరిహారం ప్రభుత్వం చెల్లించేలా ఒత్తిడి పెంచేందుకు పొలం బాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోపర్యటించనున్నారు. ఈ నెల 5న కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా కేసీఆర్ మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి రామకృష్ణారావు స్థానిక నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీరు కరువై పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పట్టారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 5న ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి .. పొలాల వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొనున్నారని చెప్పారు. అన్నదాతలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించనున్నారని వెల్లడించారు. ఈ నెల 5న ఉదయం కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్ గ్రామంలో కేసీఆర్ ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి.. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతారని తెలిపారు. అనంతరం ఎండిపోయిన పంటలకు తక్షణ సహాయం కింద ఎకరాకు 25 వేల రూపాయలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పంటలు వేసిన ప్రతి రైతుకు ఎకరా పదివేల చొప్పున పరిహారం, ఐదువందల బోనస్ చెల్లించాలని కమలాకర్ డిమాండ్ చేశారు.