revanth-kcr family
తెలంగాణ రాజకీయం

రేవంత్‌ సర్కార్‌ వేట

కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపడమే లక్ష్యంగా రేవంత్‌ సర్కార్‌ వేట కొనసాగిస్తోంది. పదేళ్లలో చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఆరోపణలు ఉన్న ప్రతీ కేసుపై విచారణ జరిపిస్తోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై రిటైర్డ్‌ జడ్జితో విచారణకు నియమించారు. తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిపైనా విచారణ కొనసాగుతోంది. మరోవైపు కేసీఆర్‌ సర్కార్‌ చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి తదితర వాటిపైనా ఆరా తీస్తున్నారు. ఇక కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, కేసీఆర్‌ సడ్డకుని కొడుకు, రాజ్యసభ ఎంపీ సంతోష్‌రావు, కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్‌రావు అక్రమాలపైనా బాధితులతో కేసులు పెట్టించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కూడా కేసీఆర్‌ ఫ్యామిలీని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.కేసీఆర్‌ ఫ్యామిటీ టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి మొదలు పెట్టిన ఆటలో తొలి వికెట్‌ పడింది.

భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదిభట్లలో కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మన్నెగూడలో రెండు ఎకరాలను కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావు కబ్జా చేసేందుకు యత్నించారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు విచారణ జరిపి కన్నారావుతోపాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్‌ కూడా ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నారావు సింగపూర్‌ పారిపోయి ఉంటాడన్న అనుమానాల వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.తనను కూడా పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన కన్నారావు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశాడు. అయితే తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

అంతకుముందు కేసు కొట్టివేయాలని కూడా కన్నారావు క్వాష్‌ పిటిషన్‌ సైతం వేశాడు. కానీ అవి కూడా ఫలించలేదు. ఇదిలా ఉండగా, 147, 148, 447, 427, 307, 436, 506r/w, 149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పార్లమెంటు ఎన్నికల వేళ.. ఇప్పటికే కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఆమె తిహార్‌ జైలులో ఉన్నారు. తర్వాత భూకబ్జా కేసులో సంతోష్‌రావుపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం కేటీఆర్‌పై సైతం క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. తాజాగా కన్నారావును అరెస్టు చేశారు. దీంతో ఇక మిలిగింది కేసీఆర్, హరీశ్‌రావు అన్న చర్చ గులాబీ భవన్‌లో జరుగుతోంది.