జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి శ్రమిస్తున్నారు. ఆయన ఎలాగైనా తాను గెలిచి తన మీద కొన్నేళ్లుగా వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆయన నిన్నటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాను పోటీ చేయనున్న ఈ నియోజకవర్గంలో తాను గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు. అందుకే ఆయన స్వరం మార్చారు. తాను ఎన్నడూ తనను గెలిపించాలని అడగలేదని, ఈసారి గెలిపించాలని అభ్యర్థిస్తున్నానని ప్రజలను వేడుకుంటున్నారు. తీవ్ర స్వరంతో కాకుండా అభ్యర్థనతో కూడిన ఆయన ప్రసంగం ఇందుకు అద్దం పడుతుంది. ఇది తన అభ్యర్థన అని గుర్తుంచుకుని తనకు మద్దతివ్వాలంటూ ఆయన పిఠాపురంలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల కంటే భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాకల్లో పోటీ చేశారు. భీమవరం ప్రజలు ఎలాగైనా తనను ఆదరిస్తారన్న అతి విశ్వాసానికి పోయి గత ఎన్నికల్లో పెద్దగా అక్కడ ప్రచారం చేయలేదు.
స్థానిక నేతలకే ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఒకటి రెండు సార్లు భీమవరంలో పర్యటించి వెళ్లినా అక్కడ కూడా తనకు ఓటమి ఎదురవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. మరో నియోజకవర్గమైన గాజువాకలో ఎక్కువ సార్లు పర్యటించి అక్కడ గెలవాలని ప్రచారం మాత్రం నిర్వహించారు. కానీ రెండుచోట్ల ఓటమి పాలయ్యారు..ఒకే ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అది పిఠాపురం. పిఠాపురంలో పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుందని కూడా సర్వే రిపోర్టులు అందడంతో ఆయన ఇక్కడ పోటీకి దిగారు. కానీ లోపల మాత్రం ఎక్కడో భయం. ఒకే చోట పోటీ చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఓటమి పాలయితే ఇక పార్టీని, తనను ఎవరూ నమ్మరని ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఆషామాషీగా దానిని ఎంచుకోలేదు. అన్ని రకాలుగా ఆలోచించి, అనేక సార్లు సర్వేలు చేయించిన తర్వాతనే అక్కడి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ నాయకుడూ వరసగా రెండోసారి గెలవలేదు. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు కూడా అందుకే భిన్నంగానే ఉంటుంది.
సామాజికవర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు 90 వేల మంది ఉన్నారు. బీసీలు అంతే సంఖ్యలో లేకపోయినా ఎనభై వేల మంది వరకూ ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓట్లను కలిపితే 96 వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 83 వేల ఓట్లు వచ్చాయి. అందుకే ఇక్కడ గెలుపు అనేది పైకి కనిపించినంత సులువు కాదు. లెక్కలు, సమీకరణలు మారుతూనే ఉంటాయి. అందుకే పవన్ ఇక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతే కాదు…ఇక్కడ తనకు అత్యంత సన్నిహితులను ఇన్‌ఛార్జులుగా నియమించి పార్టీ వ్యవహారాలను చూసుకునేలా పవన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది