election expenditure
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తడిసి మోపడవుతున్న ఖర్చు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఖర్చును అభ్యర్థులు భరించలేకపోతున్నారు. ప్రచారం కోసమే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 25వ తేదీ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీగా నిర్ణయంచారు. పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరంతా జనంలోకి వెళుతున్నారు. ఇక పార్టీ అగ్రనేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. వివిధ బహిరంగ సభలు రాష్ట్రంలో నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీటింగ్ కు రావాలంటే… ఏ రాజకీయ పార్టీ అయినా.. సరే.. మీటింగ్ కు రావాలంటే.. ప్రచారంలో అభ్యర్థితో పాల్గొనాలన్నా బీరు, బిర్యానీతో పాటు ఐదు వందల రూపాయల వరకూ తీసుకుంటున్నారు. ఇక వారికి ఉచితంగా టిఫిన్ తో పాటు రాత్రి భోజనం ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది.

ఇక ఎండాకాలం మండిపోతుండటంతో ఒక్క మంచినీళ్ల ప్యాకెట్లు, బాటిల్స్ కే అత్యధికంగా ఖర్చవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మంచినీళ్ల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని, రోజుకు లక్షల్లో ఒక్క మంచినీటికే వెచ్చించాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్యాకేజ్డ్‌ వాటర్ బాటిల్స్ ఇవ్వాల్సి రావడంతో గతంలో కంటే ఖర్చు ఇప్పుడు మించి పోయిందని అభ్యర్థులు గొణుక్కుంటున్నారు. ఎండాకాలం కావడంతో చల్లని బీరు బాటిల్స్ కోసం కూడా కార్యకర్తలు ఎగబడుతుండటంతో మరింత ఖర్చవుతుందని చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ బస్సు యాత్ర ప్రారంభించారు. మేమంతా సిద్ధం పేరిట ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఈ సభలకు పెద్దయెత్తున జనాన్ని సమీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిన్నటి వరకూ ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లాలను పర్యటించారు. రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలలో ఆయన పర్యటనలు సాగాయి.

ఈ సభలకు కూడా నియోజకవర్గాల నలుమూలల నుంచి కార్యకర్తలను తరలించాల్సి వస్తుంది. ఇది అసలు ఖర్చుతో పాటు కొసరు ఖర్చు అని నేతలు వాపోతున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కు పెద్దగా జనసమీకరణ అవసరం లేదు. సినీ హీరో కావడంతో కొంత ఆయన ఫ్యాన్స్, పార్టీ అభిమానులు సభలకు వస్తున్నారు. అయితే ఆయన సభలకు ఏర్పాట్లు కూడా స్థానిక నేతలు చూసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ నేతలు కూడా అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల మూడు పార్టీలు కలసి బొప్పూడిలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మోదీ వచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ అగ్రనేతలు ఎవరూ రాకపోయినా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారు కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. అందువల్ల ఈ రెండు పార్టీల నేతలకు తడిసి మోపెడవుతుంది. ఎండలు కూడా మరింత ఎక్కువయ్యే అవకాశముండటంతో గతంలో కంటే ఈసారి ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుందని వాపోతున్నారు.