బీఆర్ఎస్ పార్టీనో.. టీఆర్ఎస్ పార్టీనో ఇంకా క్లారిటీ లేదని, కేసీఆర్ ఏ పార్టీ నో ప్రకటించాలన్నారు మంత్రి కొండా సురేఖ. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కూతురును జైలు నుంచి విడిపించడానికి తమ ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు. మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రతీ కార్యకర్త రేయింబవళ్లు కష్టపడాలన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు.
మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లకు బుద్దిచెబుతూ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. లిక్కర్ కేస్,ఫోన్ ట్యాపింగ్ కేసులు బిఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయన్నారు.
ప్రజాధనాన్ని దోపిడి చేసిన గత ప్రభుత్వాన్ని, వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం కలిగిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని బిఆర్ఎస్, బిజేపిలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ కేసీఆర్ కు ఓ బానిస, ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. బిజేపి అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై వివరణ అడగ్గా మంత్రి సురేఖ స్పందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఎవరి ఇష్టం వారిది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మాట్లాడే హక్కు ఉందని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, లేదంటే మా స్టైల్ లో మేము మాట్లాడుతామన్నారు.