చంద్రబాబు అనుకున్నదే జరిగింది. ఏపీలో పెన్షన్ల రచ్చ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా అందాల్సిన పింఛన్లు… ఈనెల అందకుండా పోయాయి. మూడు రోజులపాటు పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది. ఈరోజు నుంచి ప్రారంభమైంది. అయితే గతం మాదిరిగా కాకుండా.. సచివాలయానికి వెళ్లి పింఛన్ అందుకోవాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎనిమిది పదుల వయసు దాటిన పండుటాకులు ఆపసోపాలు పడ్డారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పింఛన్ అందుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వృద్ధురాలు వడదెబ్బకు గురయ్యారు. అస్వస్థతతో చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టిడిపి చర్యల మూలంగానే ఆ వృద్ధురాలు మరణించిందని వైసిపి ప్రచారం చేయడం ప్రారంభించింది.ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిపివేయాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది.
కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వారితో సేవలు కొనసాగించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆరోపించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించింది. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. అయితే ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంది. కానీ మూడో తేదీ వరకు పింఛన్లు అందించలేదు. వాలంటీర్లు లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీయే కారణమని.. చంద్రబాబు సూచనతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పుకొస్తోంది. అయితే దీనిపై టిడిపి సైతం రియాక్ట్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినందునే పింఛన్లు అందించలేకపోయారని.. ఈనెల 3న పింఛన్ల పంపిణీ చేస్తామని ముందుగానే ప్రకటించారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ ఉద్యోగులు 11 మందితో పింఛన్లు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నిస్తోంది.అయితే పింఛన్ల జాప్యానికి తెలుగుదేశం పార్టీ కారణమన్న వైసీపీ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
ఇది ప్రతికూలత చూపుతోందని చంద్రబాబు గుర్తించారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు టిడిపి బృందాన్ని పంపించారు. తాను సైతం ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. తీవ్ర ఎండలు దృష్ట్యా సచివాలయం వద్దకు వెళ్లి.. పింఛన్ తీసుకునేందుకు వృద్ధులు ఇబ్బంది పడతారని.. అందుకే ఇంటికి వెళ్లి పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇలా లేఖ రాసిన గంటల వ్యవధిలోనే.. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం లో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పింఛన్ తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లి వచ్చిన వృద్ధురాలు వడదెబ్బకు గురైంది. తీవ్ర అస్వస్థతతో చనిపోయింది. విషయం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మంత్రి జోగి రమేష్, టిడిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించారు.
ఒకే సమయంలో పరామర్శకు వెళ్లడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వృద్ధురాలి మృతికి చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీనిని టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడ నుంచి పంపించాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట పింఛన్ పరిణామాలు చంద్రబాబు మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అటు టిడిపి శ్రేణులు దీనిపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయాల చుట్టూ పెన్షన్లు
నాయకులు ఎలా విమర్శించుకున్నా.. ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా.. సంక్షేమం అనేది ఆగకూడదు. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాల వల్లే వృద్ధులకు నెలకు ఇంత పింఛన్ వస్తుంది. అది మందులకో, ఇతర ఖర్చులకో పనికొస్తుంది. ఆ పింఛన్ అకస్మాత్తుగా ఆగిపోతే పండుటాకులకు ఇబ్బందవుతుంది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, వితంతువులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే పింఛన్ డబ్బులే ఆధారం.. అయితే అలాంటి పింఛన్ డబ్బులు ఏపీలో వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఇస్తారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. అంతకుముందు పోస్ట్ ఆఫీస్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయం లేదా ఊరి చివర ఖాళీ స్థలంలో టెంట్ వేసి లబ్ధిదారులకు పింఛన్లు అందించేవారు. జగన్ ముఖ్యమంత్రయిన తర్వాత పింఛన్ల పంపిణీకి సంబంధించి సరికొత్త ప్రణాళికలు అమలు చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు ప్రతినెల మొదటి వారంలోనే పింఛన్ అందుతున్నది.ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
వైసిపి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని.. వారు లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా వైసిపి నాయకులు లబ్ధిదారులతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారానే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. పండుటాకులను స్ట్రెచర్ ల మీద పడుకోబెట్టి ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ తరహా నిరసనలకు సంబంధించిన వీడియోలను వైసీపీ నాయకులు.. తమ పార్టీకి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీ నిలిచిపోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.అయితే ఇలాంటి వీడియోలపై టిడిపి నాయకులు గట్టిగానే స్పందిస్తున్నారు. గతంలో వలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగా వైసిపి నాయకులు ప్రచారం చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని వీడియోలతో సహా టిడిపి నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు.
ఈ నెల 3న పింఛన్లు ఇస్తామని సాక్షి పత్రికలో రాసుకున్నారని.. కానీ అంతలోనే ఎన్నికల సంఘం బ్రేకులు వేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారని టిడిపి నాయకులు వైసిపి నేతలపై ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్లే పింఛన్లు ఇవ్వలేదని, కానీ దానిని తెలివిగా చంద్రబాబు మీదకి డైవర్ట్ చేస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు. మొత్తానికి పింఛన్ల పంపిణీ నిలిపివేత అంశం ఎన్నికల ముందు ఏపీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.