ఆరోగ్యం సహకరించకపోయినా అలుపెరగని యోధునిలా మొక్కలు నాటుతూనే దరిపల్లి రామయ్య. దరిపల్లి రామయ్య అంటే టక్కున గుర్తు రాకపోవచ్చు కానీ .. ఎవ్వరికీ పరిచయం చేయనక్కర్లేని ఆయనే వనజీవి రామయ్య.జనంలో వనం ఉండటం కాదు.. వనంలోనే జనం ఉండాలి.” అనే సూక్తిని మనసా, వాచా, కర్మణా నమ్మి నేటికీ ఆచరిస్తున్న మహోన్నత వనజీవి మన దరిపల్లి రామయ్య. ఎమ్మెల్యేగా గెలిస్తే ఐదేళ్ల పాటు సంపదని పోగేసుకోవాలని ఆలోచిస్తారు. మంత్రి పదవి చేజిక్కితే ముని మనవళ్ల వరకు తరతరాలు కూర్చుని తినాలని స్కెచ్ వేస్తారు. ఇది లోకం పోకడ.అయితే దరిపల్లి రామయ్య “మొక్క”వోని అకుంఠిత దీక్షకు కేంద్ర ప్రభుత్వమే మెచ్చి “పద్మశ్రీ”ని ప్రధానం చేసింది. అంతటి గొప్ప కిరీటం నెత్తిన ధరించిన్నప్పటికీ ఆయన గర్వాన్ని వీడి ఇంకా మొక్కలు నాటుతూనే ఉండటం గొప్ప విశేషం. ఆయన జీవనపర్యంతం ఇప్పటికి కోటి మొక్కలకు పైగా నాటారంటే ఔరా.! అనక మానరు.”చెట్లను పెంచండి.. ఆరోగ్యకరమైన పచ్చటి వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పంచండి..” అంటూ 92 ఏళ్ల వయసులోనూ ఆయన కొత్త కొత్త మొక్కలకు అంకురార్పణ చేస్తూనే ఉన్నారు.
మూడు పదుల వయసొస్తేనే మోకాళ్ళు సహకరించని ఈ మందుల కాలంలో తొమ్మిది పదుల వయసు మీరినా తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సమాజం కోసం పోరాడుతున్నారు దరిపల్లి రామయ్య. ఆయన నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా ఎదిగి పచ్చదనాన్ని పంచుతుంటే రోడ్డు విస్తరణ క్రమంలో నరికి వేస్తుంటే మౌనంగా ఆ వేదనను భరించారు రామయ్య.అయినా కుంగిపోకుండా ఎక్కడి నుంచో కొత్త కొత్త విత్తనాలను తీసుకొచ్చి వాటికి మొక్కలుగా పురుడు పోస్తున్నారాయన. తన తుది శ్వాసను వదిలే వరకు మొక్కలు పెంచడమే తన పని అంటూ ముందుకు సాగుతున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య. సమాజంలో చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తూ తాను పెంచిన చెట్లు ఎందరికో ఫలాలను, నీడను ఇస్తుంటే చూసి మురిసిపోతుంటాడు. అంతేకాకుండా ఒంట్లో శక్తి ఉన్నంతసేపు ఏదో ఒక కొత్త మొక్కని నాటడమే తనకు ఇష్టమని చెబుతారాయన.పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా ఎప్పుడూ రోడ్డు వెంట ఏదో ఒక మొక్కను నాటుతూ ఒక సామాన్యుడిలా కనిపిస్తారు రామయ్య.
ఆయన ఇంటికి ఎవరొచ్చినా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. దీన్నిబట్టి ఆయనకి మొక్కల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్రతి వేసవిలో రామయ్య వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ దొరికే విత్తనాలను సేకరించి వాటిని వర్షాకాలంలో చల్లి కొత్త మొక్కల పెంపకానికి ప్రయత్నిస్తూ ఉంటారు.తన కృషిలో కుటుంబ సభ్యుల సహకారంతోపాటు తన భార్య జానమ్మ ఎప్పుడూ తోడునీడగా నిలుస్తుందని చెబుతారు. మొక్కలను పెంచి రేపటి సామాజహితం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రామయ్య చివరికి వారి కొడుకులు, మనవరాళ్లకు సైతం చెట్ల పేర్లను పెట్టుకోవడం విశేషం.దరిపల్లి రామయ్య కృషి ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కోటి మొక్కలు నాటిన మహా మనిషిగా ఆయన్ను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రామయ్య ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా దరిపల్లి రామయ్యను రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. “ఒక గుడి లేక బడి ఎక్కడైనా ఒక మొక్క నాటండి.
” అనే నినాదంతో భావి తరాలకు మెరుగైన ఫలాలను అందించాలన్న సంకల్పంతో నేటి యువత మందుకెళ్ళాలనే సత్ సంకల్పాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లి నర్సరీల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చిందిఅలాగే రామయ్య కృషి అసామాన్యమని ఆయనకు మరింత గుర్తింపు అవసరమని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 6వ తరగతిలో వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం గొప్ప పరిణామం. అడవులు అంతరించిపోతున్న ఈ తరుణం లో రేపటి సామాజాహితం కోసం, వన్య జీవుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా ముందడుగు వేయాలని రామయ్య పిలుపునిస్తుంటారు.ఆయన పిలుపుని సవీకరించేవారు వాస్తవానికి నూటికి ఒక్కరు కూడా లేకపోవచ్చు. అయినా ఆయన కుంగిపోరు. మండుటెండని సైతం లెక్క చేయకుండా ఆయన నాటిన మొక్కలకు ప్రాణం పోసేందుకు నీటిని బండిపై మోసుకెళ్లి పోస్తారు.
ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలోనూ ఆయన అలసట ఎరుగకుండా విత్తిన విత్తులకు నీళ్లు పోస్తూనే ఉన్నారు.విత్తనాల్ని వాటిని మొక్కలుగా మార్చేందుకు తహతహలాడుతున్నారు. తాగేందుకే నీరు దొరకని ఈ గడ్డు పరిస్థితుల్లో తన బండి చుట్టూ నీటి క్యాన్లు కట్టుకొని మొక్కలకు నీరు పోసి బతికించడం కోసం పడుతున్న తాపత్రయానికి ప్రతి ఒక్కరూ హాట్సాఫ్ చెప్పక తప్పదు.