- వారంపది రోజుల్లోనే పూర్తవుతున్న ప్రక్రియ
ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి పోర్టల్‌లో ‘అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యుటేషన్’ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1,27,177 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 1,26,673 దరఖాస్తులను.. అంటే 99.65 శాతం పరిష్కరించారు.
సగటున 9 నిమిషాల్లోనే..
రైతు తగిన ఆధారాలతో పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అది నేరుగా కలెక్టర్ లాగిన్‌లోకి వెళ్తుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి అనుమతిస్తారు లేదా తిరస్కరిస్తారు. అనుమతించిన దరఖాస్తులు తాసిల్దార్ లాగిన్‌కు వస్తున్నాయి. ఈ ప్రక్రియ గరిష్ఠంగా వారం పది రోజుల్లోనే పూర్తవుతున్నది. ఆ తర్వాత రైతు స్లాట్ బుక్ చేసుకొని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి కొత్త పాస్‌బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. తాసిల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ ప్రక్రియ సగటున 9 నిమిషాల్లోనే పూర్తవుతున్నది.