- వివాదాల పరిష్కారానికి అది తొలి ప్రయత్నం
- మధ్యవర్తిత్వానికి మహాభారతం ఉదాహరణ
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
వివాదాల పరిష్కార ప్రక్రియలో ముందుగా మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావలసిన అవసరమున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అలాంటి చట్టం వల్ల మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించే దిశగా పెద్ద అడుగు పడుతుందని సూచించారు. దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 4.5 కోట్లకు చేరిందంటూ దాన్ని న్యాయ వ్యవస్థ అశక్తతగా భావించడం తగదని చెప్పారు. అది ఎక్కువ చేసి చెప్పడమే అవుతుందని స్పష్టం చేశారు. కోర్టుల్లో జాప్యానికి దావాల మీద దావాలు వేసేందుకు ఉన్న వెసులుబాటు కూడా ఒక కారణమని చెప్పారు. శనివారం ఇక్కడ నిర్వహించిన ‘ఇండియా-సింగపూర్ మధ్యవర్తిత్వ సదస్సు’లో జస్టిస్ ఎన్వీ రమణ కీలకోపన్యాసం చేశారు. మధ్యవర్తిత్వాన్ని ప్రధాన స్రవంతిగా చేయడమనే అంశంపై ప్రసంగించారు. ‘పెండింగ్ కేసుల లెక్క చెప్పేటప్పుడు అప్పటివరకు పరిష్కారం కాని కేసులు అన్నింటినీ గణిస్తున్నారు. నిన్న దాఖలైన కేసును పెండింగ్ కేసుల జాబితాలో వేస్తున్నారు. ఒక కేసు న్యాయ వ్యవస్థకు వచ్చి ఎన్నాళ్లయిందనే విషయాన్ని పరిగణించడం లేదు’ అని జస్టిస్ రమణ చెప్పారు. ఏ సమాజంలోనైనా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన వాటితో పాటు వివిధ కారణాల వల్ల వివాదాలు అనివార్యమని తెలిపారు. వాటి పరిష్కారానికి యంత్రాంగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం..
మహాభారతాన్ని ప్రస్తావిస్తూ వివాద పరిష్కార సాధనంగా ముందుగా మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించడం అప్పుడే ఉన్నదని సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ‘మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కార ప్రయత్నానికి మహాభారతం మనకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది. పాండవులు, కౌరవుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు’ అని తెలిపారు. వివాదాలను సమాజంలో పెద్దలు పరిష్కరించేవారని, అయితే 1775లో బ్రిటిషు న్యాయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత పాత పద్ధతులు కొట్టుకుపోయాయని వివరించారు.
త్వరలో విచారణల ప్రత్యక్ష ప్రసారం
సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని త్వరలో ప్రారంభిస్తామని జస్టిస్ రమణ తెలిపారు. తొలిదశలో కొన్ని కోర్టు రూముల నుంచి ‘లైవ్’ ప్రారంభమవుతుందని చెప్పారు. గుజరాత్ హైకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా సీజేఐ జస్టిస్ రమణ ప్రసంగించారు.
తెలంగాణ చొరవ అభినందనీయం
‘అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్) వేదిక ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం ముందుకువచ్చింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరిస్తాయని ఆశిస్తున్నాను’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.