కేంద్రంలో అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నిజానికి ఈ హామీ ఏపీ రాజకీయల్లో ప్రకంపనలు సృష్టించాలి ఎందుకంటే ప్రత్యేకహోదా అనేది ప్రజలకు సెంటిమెంట్ గా మారిందని రాజకీయవర్గాలు భావిస్తూ వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రకటన చేస్తే ఎక్కడా స్పందన లేదు. గతంలో ప్రత్యేకహోా అంశమే హైలెట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎందుకు ప్రజల్లో స్పందన రావడం లేదు ?. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయమని ప్రజలు నమ్ముతున్నారా ? . రాజకీయ పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారా ?ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకహోదా అనేది భారీ ఎన్నికల ప్రచార అంశం. రెండు ఎన్నికలను ఆ అంశం ప్రభావితం చేసింది. అయితే రెండు సార్లు హామీ నెరవేరలేదు. రెండు సార్లు రెండు రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. ఇప్పుడు మరో సారి ఆ టాపిక్ ను ఎత్తేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో మాట్లాడటం మానేశాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేసేందుకు ఆసక్తిగా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నా కుడా చేశారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని వివిధ పార్టీల నేతల్ని కూడా కలిశారు. కొంత మంది ఏఐసీసీ నేతలతో కలిసి ఏపీ భవన్ లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా విషయంలో ప్రస్తుతం సీఎం జగన్ గతంలో చేసిన భారీ ప్రకటనల్ని మీడియా ముందుకు వినిపించారు. పార్టీలన్నీ ఏపీని మోసం చేశాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. ప్రత్యేకహోదా పై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ హామీపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితే లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014 ఎన్నికల్లో ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ప్రత్యేకహోదా వల్ల స్పష్టంగా ఎలాంటి ప్రయోజనాలు వస్తాయన్న స్పష్టత ఎవరికీ లేదు. కానీ .. ప్రత్యేకహోదా అనే పేరులోనే ఓ ఎమోషన్ ఉంది. అది ప్రజల్ని ఆకట్టుకుంది.
అయితే ప్రత్యేకహోదా ఇవ్వలేదు. ఆ పేరుతో వచ్చే ప్రయోజనాల కన్నా ఎక్కువ ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ ఎవరూ నమ్మలేదు. ఏపీలో రాజకీయ పార్టీలు అసలు అంగీకరించలేదు. ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని జగన్ చెప్పారు. ఇన్‌కంట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరంలేదని జగన్ గొప్పగా చె్ప్పేవారు. ప్రతీ నెలా దీక్షలు చేసేవారు. విద్యా సంస్థల్లో సమావేశాలు పెట్టారు. విద్యార్తులతో ఆవేశపూరిత ప్రసంగాలు ఇప్పించేవారు. ఆయన శ్రమ ఫలించింది.. ఇరవై రెండు ఎంపీ సీట్లు గెల్చు కున్నారు. కానీ ప్రత్యేకహోదాపై ఆయన కనీస పోరాటం చేయలేకపోాయరు. భారీ మెజార్టీ పొందిన సీఎం జగన్ హోదా కోసం ఆయన ఈ ఐదేళ్లలో చిన్న ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాజ్య సభలో కేంద్రానికి వైసీపీ ఎంపీల మద్దతు కీలకం అయినప్పుడు కూడా ఎలాంటి షరతులు పెట్టలేదు. దీంతో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హోదా అంశాన్ని మొత్తంగా పక్కన పెట్టేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే ఎన్నికల అంశం అయింది.
హామీైలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. కానీ హోదా మాత్రం రాలేదు. దీంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయినట్లయింది. ప్రత్యేకహోదా అంశాన్ని రెండు ఎన్నికల్లో వాడేశారు కానీ ప్రత్యేకహోదా రాలేదు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక ప్యాకేజీ అయినా వచ్చింది కానీ.. వైసీపీ హయాంలో అసలు ఊసే లేదు. కావాల్సినన్ని అప్పులు ఇస్తున్నారు కదా.. అదే హోదా అనుకున్నారన్న సెటైర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు మళ్లీ ప్రత్యేకహోదా అంటే ప్రజలు ఎంత మేర నమ్ముతారన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి. ప్రజల్ని నమ్మించగలిగితే.. ఆ నినాదం ఎత్తుకున్న వారికి రాజకీయంగా మేలు జరుగుతుంది. కానీ రాజకీయ పార్టీలు పదే పదే మోసం చేయడం వల్ల ప్రజలు నమ్మకం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పరంగా ఎలాంటి డిమాండ్ అయినా ప్రజల్లో స్పందన ఉంటేనే.. రాజకీయ పార్టీలు ముందుకు తీసుకెళ్తాయి. ఆ డిమాండ్ ఎవరికీ ఆసక్తి లేదనుకుంటే… వదిలేస్తాయి.
ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో ప్రజల్లో ఎలాంటి ఎమోషన్ లేదని రాజకీయ పార్టీలు గుర్తించాయి. అందుకే అసలు ప్రస్తావించడం లేదు. అంతే కాదు.. ప్రస్తావించిన రాజకీయ పార్టీలు నమ్మే పరిస్థితి లేదు. పదేళ్లు ఇస్తామన్న పార్టీలు.. మెడలు వంచుతామన్న పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయంగా మారింది. విషాదం ఏమిటంటే హోదా పేరు లేకుండా అందులో ఉన్న ప్రయోజనాలు అన్నీ కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా వాటినీ తెచ్చుకోలేకపోవడం.