NDA alliance
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కూటమిలో కనిపించని  ఉమ్మడి అజెండా…      

జట్టుకట్టడం వరకు విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఏపీలో వ్యూహాత్మకంగా ముందుకు సాగడంలో విఫలమౌతోంది. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గట్టెక్కిస్తుందని నమ్ముకుంటున్నారు తప్ప సమకాలీన రాజకీయ వాతావరణాన్ని ఒంటబట్టించుకోవట్లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో గాఢమైన వ్యతిరేకత ఉంది అంటూనే, ఇంకా ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. విలువైన సమయం, వివిధ వనరులు ఇంకా దానికోసమే వెచ్చిస్తున్నారు తప్ప తాము అధికారంలోకి వస్తే తెచ్చే మార్పేమిటో జనానికి వివరించడం లేదు. ఆ దిశలో ఉమ్మడి నినాదం లేదు. నిర్దిష్ట ఎజెండాయే లేదు. కూటమి రావాలని జనం బలంగా కోరుకునే ఒక ప్రాతిపదికను సృష్టించి, బలోపేతం చేసే ఏ ప్రయత్నమూ పకడ్బందీగా జరగటం లేదు. ప్రజల్లో కొత్త నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ కలిగించే ఎజెండాను సెట్‌ చేయకపోవడం, దాన్నొక చర్చనీయాంశం చేయలేకపోవడం కూటమి వైపు నుంచి పెద్ద లోపంగా కనిపిస్తోంది.తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఇబ్బందులు లేకుండానే సీట్ల సర్దుబాట్లు చేసుకోగలిగినా ఇప్పటి వరకు కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనల్లో అది ప్రకటిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించుకోవడంలో విఫలమయ్యాయి.

బలమైన కారణం లేకుండానే జాప్యం జరుగుతోంది. ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ రూపొందిస్తామంటూ ఎన్డీయేతరపున ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఫలానా ‘వాట్సప్‌’ నెంబర్‌కు సలహాలు, సూచనలు పంపించండని ప్రకటన చేశారు. పైగా దేశంలో ఇలా చేయడం ఇదే మొదటిసారని ఓ అబద్దం కూడా ఆలవోకగా ఆడేశారు. పోలింగ్‌కు 30 రోజులు కూడా లేని తరుణంలో ఉమ్మడి ప్రచారాంశం, నిర్దిష్ట ఎజెండా, మేనిఫెస్టో లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో కూటమి ప్రచారం ఇప్పుడు దశ`దిశ లేకుండా సాగుతోంది. జనబాహుళ్యంలోకి బలంగా దూసుకుపోయే పాజిటివ్‌ ప్రచారం ఊపందుకోవడం లేదు. భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.దశాబ్దకాలంగా రాజకీయాల్లో వస్తున్న మార్పులను గమనించినా, ఇటీవలి ఎన్నికల ఫలితాలను విశ్లేషించినా ఒక పరిణామం నిర్ణయాత్మకంగా కనిపిస్తోంది. కొనసాగుతున్న ప్రభుత్వాలను గుడ్డిగా విమర్శిస్తూ, పదే పదే ఆరోపణలు చేస్తూ నెగెటివ్‌ ప్రచారంపైనే విపక్షాలు ఆధారపడితే ఫలితాలు సున్నా. ఒకవైపు అది సాగిస్తూనే, ఇంకోవైపు అంతకన్నా బలంగా…. తాము అధికారంలోకి వస్తే ఏ విధంగా మేలు చేయగలుగుతాం, మెరుగైన పాలన అందించగలుగుతామని చేసే పాజిటివ్‌ ప్రచారమే రాజకీయంగా ఫలితాలు తెచ్చిపెడుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ 2018లో బొక్కబోర్లా పడి 2023లో గొప్ప విజయం సాధించడం వెనుక పనిచేసిన సూత్రం ఇదే! కర్ణాటకలో కాంగ్రెస్‌ సాధించిన గెలుపు వెనుక మర్మం కూడా ఇదే. విపక్షాల సంగతి అలా ఉంచితే, పాలకపక్షాలు కూడా ప్రజల్లో నమ్మకం సడలనీకుండా పాజిటివ్‌ ప్రచారం ప్రభావవంతంగా చేసుకున్న చోట ఫలితాలు వారికి అనుకూలంగానే వచ్చాయనడానికి గుజరాత్‌ మంచి ఉదాహరణ. ఆ ఎన్నికల్లో పాజిటివ్‌ ప్రచారం లేక కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. గుజరాత్‌కు ముందర, తర్వాత జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక అసెంబ్లీల ఎన్నికల్లో కలిసొచ్చిన విధానాలను తెలంగాణలో కొంతమేర అనుసరించిన కాంగ్రెస్‌ మిగతా మూడు హిందీ రాష్ట్రాల్లో అనుసరించలేకపోయింది. అందుకు అనుగుణంగానే భారీగా నష్టపోయింది. పాలకపక్షం పాజిటివ్‌ ప్రచారం ముందు, తాము అధికారంలోకి వస్తే చేయగల మంచేమిటో వివరించలేక, కేవలం విమర్శలకు నెగెటివ్‌ ప్రచారాలకు పరిమితమైనందుననే ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడటం నిలువెత్తు నిదర్శనం.క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు కూటమి పక్షాలు ఎంత వ్యూహలోపంతో ఉన్నాయో ఇట్టే బోధపడుతోంది.

టీడీపీ రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌అంశాలు ఇప్పుడు మరుగున పడ్డాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర సందర్భంగా ఇచ్చిన నిర్దిష్ట హామీలపై గానీ, వికసిత భారత్‌, వికసిత ఏపీ అంటూ చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ ద్వారా బీజేపీ పలికించిన ప్రగతి మాటలపై గానీ ప్రజలకు పూర్తి అవగాహన లేదు, అందుకే వాటికి రీకాల్‌ వాల్యూ కూడా లేదు. వాటిని సమీకృతపరచి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమమో, ఉమ్మడి మేనిఫెస్టోనో ప్రకటించాలన్న సోయి కూటమి అగ్రనేతలకు లేకుండా పోయిందన్నది ఇంటా-బయటా వినిపిస్తున్న విమర్శ. ‘ఎన్నికల్లో పాజిటివ్‌ అజెండాతో వెళ్తేనే ఫలితాలు వస్తాయని పలుమార్లు రుజువైంది. కేవలం అధికార పార్టీని తిట్టడం వల్ల ఉపయోగం లేదు. నోటి దురదను తీర్చుకోవడం తప్ప రాజకీయంగా మేలుండదు. ఉమ్మడిగా ఏదైనా పాజిటివ్‌ ప్రచారాంశాన్ని మాకివ్వండి, బలంగా జనక్షేత్రంలోకి తీసుకుపోతాం’ అని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల శ్రేణులు తమ అధినాయకత్వాన్ని కోరుతున్నాయి.

ఓటింగ్‌కు ముందు, జనం మెదళ్లలో నాటుకునేలా వాటిని అట్టడుగు స్థాయి వరకు తీసుకువెళ్లాలంటే ఎలాగూ సమయం పడుతుంది, కనుక ఇంకా జాగు చేయొద్దన్నది వారి కోరిక. తెలుగు సంవత్సరాది, ఉగాది అందుకు ఒక మంచి సమయం`సందర్భం అని కూడా పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.కూటమి పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీలు నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని, వైసీపీని ఆడిపోసుకోవడానికి, తిట్టడానికే సమయాన్ని వెచ్చించాయి. జనం దృష్టిలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. ఇంత కాలం జనం వీరి మాట విన్నారు. సరే, కనీసం ఎన్నికల వేళనైనా వారి తీరును మార్చుకోకుంటే, అధికారంలోకి వస్తే జనానికి ఏం చేస్తారో నిర్దిష్టంగా-విస్పష్టంగా చెప్పకుంటే… రాజకీయంగా కూటమి తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందనేది సుస్పష్టం. బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, అదే తమపని తేలిక చేస్తుందని భ్రమో, నమ్మకమో…. అందులోనే మునిగి తేలుతున్న కూటమి పార్టీలు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి.

నిర్దిష్ట ఎజెండా, ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థికాంశం, నమ్మదగ్గ మేనిఫెస్టో లేకుండా…… పాలకపక్షం ప్రచార ఉచ్చులో పడితేనో, మీడియా ఎజెండాలో చిక్కుకుంటేనో కూటమిని ప్రజలు ఆదరించరు. ఇప్పుడున్న సర్కారుతోనే సరిపెట్టుకుంటారు. అదే జరిగితే, నంబర్లలో కొంత వ్యత్యాసం రావొచ్చు కానీ, తుది ఫలితం మాత్రం 2019 పునరావృతమే! కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్‌ఆర్‌సీపీ క్షేత్రస్థాయిలో, పోలింగ్‌ బూత్‌ వరకు ప్రచారాన్ని బలంగా తీసుకు వెళుతోంది.పెన్షన్లను టీడీపీ ఆపుతోందని ఎన్నికల వాకిట్లో కూడా వైసీపీ గట్టిగా ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించే యత్నం చేయడం తాజా ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టే బలమైన కౌంటర్‌ ప్రచారం లేకపోవడంతో జనం దాన్నే కొంత వరకు నమ్మే పరిస్థితి కూడా ఉంది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవని, మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని, దానికి తోడు ఇప్పుడు నిలిచిపోయిన అభివృద్ధిని పునరుద్దరిస్తామని కూటమి గట్టిస్వరంతో వినిపించాలి.

గడచిన అయిదేళ్లలో అభివృద్ది లేమి ఏయే రంగాలను బాగా దెబ్బతీసింది, జనం ఎట్లా నష్టపోయారు, తాము అధికారంలోకి వస్తే ఆ నష్టాన్ని పూరించేలా ఏమేమి చర్యలు చేపడతారో కూటమి వివరించాలి. కొత్త ఆశను, నమ్మకాన్నీ ప్రజలకు కల్పించలేకపోతే…. ప్రచార వ్యూహం దెబ్బతిన్నట్టే లెక్క! అలా చెప్పుకోవడంలో కూటమి ఇప్పటిదాకా పూర్తిగా విఫలమైంది.కూటమి పార్టీల ప్రచారంలో సమన్వయ లోపముంది. ఎవరికి వారే యమునా తీరే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థూల దృష్టితో చూసినప్పుడు కూటమి పార్టీల విధానాలు, హామీల్లో కొన్ని సామాజికార్థికాంశాల ఏకరూపత ఉంది. అటువంటి అంశాలను మేనిఫెస్టోలోనో, కనీస ఉమ్మడి కార్యక్రమంలోనో పొందుపరచి, మరింత ప్రజావిశ్వాసాన్ని చూరగొనవచ్చు. ఈ విషయంలో అగ్ర నేతల మధ్య చొరవ అవసరం. వారు దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు లేదు. వారి మధ్య సమన్వయం ఉన్నట్టు కూడా కనబడడం లేదు. నిరంతరాయంగా తమకు మేలు చేసేట్టు, మంచి పాలనను అందించేట్టు ప్రజలకు నమ్మకం కలిగించేలా సమిష్టిగా ఉన్నామనే సందేశాన్ని పంపడంలో కూటమి పార్టీలు విఫలమవుతున్నాయి.

ఈ సమిష్టితనం లోపిస్తే వివిధ భాగస్వామ్య పార్టీల కిందిస్థాయి కార్యకర్తలు, సానుభూతిపరులపైన కూడా ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. అప్పుడు, పొత్తుల్లో ఒక్కో పార్టీ నుంచి బరిలో ఉండే అభ్యర్థులకు ఇతర పార్టీల నుంచి ఓటు బదిలీ కూడా కష్టం అవుతుంది. ఈ విషయాన్ని కూటమి నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది పైన నాయకత్వ స్థాయి నుంచి కింద ఎన్నికల బూత్‌ వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది.