శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం కాగా.. శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు (జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంసందర్భంగా…. ఏప్రిల్ 12న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొపారురు. ఆ తర్వాత ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. ఆ తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు
ఏప్రిల్ 13న పసుపు దంచే కార్యక్రమం…
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. ఏప్రిల్ 17న ప్రారంభము కానున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు.
శ్రీ రామనవమి ఉత్సవాలు
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
ఏప్రిల్ 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
ఏప్రిల్ 18న తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.
శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.