దూర ప్రయాణం చేయాలంటే చాలామంది నేటికీ రైళ్లకే ఓటు వేస్తారు. రైల్వే శాఖ కూడా అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి చాలామంది అందులోనే వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తారు. ఇక ఇటీవల వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది దూర ప్రయాణాలకు వాటికే ఓటు వేస్తున్నారు. అయితే ఈ ప్రయాణాలకు సంబంధించి కొంతమంది టికెట్లు కొనుగోలు చేయరు. టీసీలకు దొరకకుండా బోగిల వెంట బోగీలు మారుతుంటారు. వీరిని అన్నిసార్లు పట్టుకోవడం కుదరక పోయినప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం టీసీలు పట్టుకుంటారు. అపరాధ రుసుం విధిస్తారు. ముక్కు పిండి ఫైన్ వసూలు చేస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. అయినప్పటికీ కొంతమంది టికెట్ లేకుండానే రైలు ప్రయాణం సాగిస్తారు.వాస్తవానికి మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది. రోజుకు లక్షల్లోనే ప్రయాణికులు రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. రైల్వే చార్జీలు కూడా సామాన్లకు అందుబాటులోనే ఉంటాయి.
అయితే ఈ రైళ్లల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే రైల్వే శాఖ కేసులు పెడుతుంది. జరిమానాలు విధిస్తుంది. అయితే ఈ రైళ్లల్లో ప్రయాణించేవాళ్లు కచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాలి. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే రైల్వే శాఖ ఊరుకోదు. టికెట్ లేకుండా ప్రయాణం చేసినట్టు దొరికిపోతే అపరాధ రుసుం విధిస్తుంది. ఇలా ప్రయాణికుల నుంచి ఒక సంవత్సరంలో రైల్వే శాఖ 173.89 కోట్లు జరిమానాగా వసూలు చేసింది. పశ్చిమ రైల్వే విభాగం ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు పలు రైళ్లల్లో టీసీ ల ద్వారా చెకింగ్ నిర్వహించింది. ఇలా చేయగా రైల్వే శాఖకు 173.89 కోట్లు వసూలయ్యాయి. ఇందులో ముంబై ప్రాంతం నుంచే 46.90 కోట్లు ఫైన్ రూపంలో వచ్చాయి.ఇక గత మార్చి నెలలో 16.77 కోట్ల పెనాల్టీని రైల్వే శాఖ వసూలు చేసింది.. ఏసీ బోగీల్లో అనధికార ప్రయాణాలను నిలిపి వేసేందుకు రైల్వే అధికారులు చెకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు 60 వేల మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేసినట్టు గుర్తించారు.
వారి నుంచి జరిమానా వసూలు చేశారు. ఇంకా కొంతమందిని జైళ్లకు కూడా పంపించారు. అయితే గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మార్చి వరకు రైల్వే అధికారుల చెకింగ్ లో 25% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు టికెట్ లేకుండా రైళ్లల్లో ప్రయాణించారు. అధికారులు ఆ స్థాయిలో తనిఖీలు చేస్తున్నప్పటికీ అనధికార ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గడం లేదన్నమాట.