ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివాటెక్-2021 ఐదో ఎడిషన్‌లో ప్రసంగించనున్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో పాటు ఈయూలోని వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ఎంపీలు పాల్గొనున్నారు. ఆపిల్ సీఈఓ టీమ్‌కుక్, ఫేస్‌బుక్ చైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్‌తో పాటు తదితర ప్రముఖులు హాజరవనున్నారు. ‘వివాటెక్’ యూరోప్‌లో జరిగే అతిపెద్దదైన డిజిటల్, స్టార్టప్ కార్యక్రమాల్లో ఒకటి. 2016 నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలను పారిస్‌లో జరుపుతున్నారు. కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మీడియా గ్రూప్ లెస్ ఇకోస్ ప్రముఖ అడ్వటైజింగ్, మార్కెటింగ్ రంగంలోని ప్రముఖ సంస్థ అయిన పబ్లిసిస్ గ్రూప్‌తో కలిసి నిర్వహిస్తున్నది.
కార్యక్రమం సాంకేతిక విజ్ఞాన రంగంలో.. స్టార్టప్ ఇకో సిస్టమ్‌లో భాగం పంచుకుంటున్న సంస్థలను ఒకే చోటులో సమావేశ పరుస్తోంది. ప్రదర్శనలు, పురస్కారాలు, గ్రూప్ డిస్కషన్, స్టార్టప్ పోటీలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉండనున్నాయి. వివాటెక్ ఐదో ఎడిషన్ సమావేశాలు బుధవారం నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీని వివాటెక్ గౌరవ అతిథిగా ఆహ్వానించిందని పీఎంఓ తెలిపింది. సాయంత్రం 4 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో ప్రసంగిస్తారని పేర్కొంది. ‘టెక్-స్టార్టప్ ప్రపంచంలో భారత్ సాధించిన పురోగతి’పై ప్రధాని కీలకోపన్యాసం చేస్తారని పీఎంఓ వివరించింది.