వచ్చే నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ ఒక్కో ప్రచార అస్త్రాన్ని ఎంచుకుంటుంది.ఎవరి అస్త్రాలతో వారు సరికొత్త వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం, రామరాజ్యం వంటి నినాదాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలు ఉండగా…..ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ డజన్ కు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని బలంగా చెబు తూంటే….ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ పార్టీ మాత్రం గతంలో ఇచ్చిన ” సారు…..కారు…పదహారు ” వంటి నినాదాలను ఈసారి పక్కన పెట్టిందనే చెప్పాలి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎజెండాలను ఒకసారి పరిశీలిస్తే…..ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ….ఇప్పటికే అమలు చేసిన పలు గ్యారెంటీ లను ప్రజల్లో బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం,రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ భీమా పెంపు, ఇందిరమ్మ ఇండ్లు….వంటి పధకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది.
రానున్న రోజుల్లో పంటల భీమా,రైతు భరోసా, వరికి బొనస్, పెన్షన్లు తదితర హామీలను రానున్న రోజుల్లో అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఓటర్లలో సగం జనాభా ఉన్న మహిళా ఓటర్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాగా రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లె ఎక్కువగా ఉన్నారు. అలాంటి స్థానాలలో కాంగ్రెస్ ఎక్కువ శ్రద్ధ పెడుతుంది.ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం ఉన్న సెగ్మెంట్ల పై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న గ్యారెంటీలను మహిళా ఓటర్లకు బలంగా ప్రచారం చేసుకుంటుంది.ఇటీవలే తుక్కుగూడ లో జరిగిన జన జాతర సభలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలను పార్టీ సమీకరించింది.అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తో పాటు గత ప్రభుత్వ హయంలో జరిగిన వైఫల్యాలను కూడా కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తుంది.
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్,కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి,ఫోన్ ట్యాపింగ్ ,గొర్రెల స్కాం, ఆవుల స్కాం….ఇలా అనేక వైఫల్యాలను ఎత్తిచూపుతూ….ఆ పార్టీనీ మరింత బలహీన పరిచేందుకు ఆ పార్టీ నేతలను వరుసగా కాంగ్రెస్ లో చేర్చుకుంది.ఆ పార్టీ నుంచి వచ్చే వలస నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహానికి కాంగ్రెస్ తెర లేపుతుంది.ఎన్నికల ప్రచార తీవ్ర రూపం తీసుకునే సమయానికి గులాబీ పార్టీని మరింత వీక్ చేసేందుకు బిఆర్ఎస్ ను ఉచ్చులో బిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.పదేళ్లు పాలించి హ్యాట్రిక్ విజయం సాధించాలి అనుకున్న బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రేక్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో రైతులకు కష్టాలు మొదలు అయ్యాయని,రాష్ట్రంలో త్రాగు నీటి,సాగు నీటి కరువు ఏర్పడిందని, కరెంటు కోతలు మొదలు అయ్యాయని…..ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పిస్తూ ఈ అంశాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది.పదేళల్లో లేని కరువు కాంగ్రెస్ ఏర్పడిన నాలుగు నెలలో వచ్చిందని దానికి కాంగ్రెస్ అసమర్ధత, చేతే గాని పాలనే కారణమని,ఈ కారును ప్రకృతి తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో పొలం బాట పట్టి రైతులతో ముచ్చటించి వారికి ధైర్యం ఇస్తున్నారు.సాగునీటి సరఫరా చేయకపోవడం తో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలోనే 200 మందికి పైగా రైతులు మరణించారని…..ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే కేసిఆర్ చెబుతున్న మాటలను మాత్రం అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిప్పి కొడుతున్నాయి.రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా కేసిఆర్ కు లేదని పదాల్లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కేసిఆర్ ప్రభుత్వం ఆదుకోలేదని,లక్షల్లో ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎంత మంది రైతులకు నష్ట పరిహారం చెల్లించారు అంటూ బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి.నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్యూహంగా 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీజేపీ పార్టీ గత బిఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూనే……వంద రోజుల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ఉంది.డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని,రామరాజ్యం తోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుతుంది.వీటితో పాటు ప్రధాని మోడీ ఇమేజ్,అయోధ్య శ్రీరాముడి ప్రణ ప్రతిష్ఠ,రాష్ట్రానికి పసుపు బోర్డు,గిరిజన యూనివర్సిటీ,ఎస్సీ వర్గీకరణకు హామీ తదితర అంశాలను బీజేపీ ప్రస్థావిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ ను వాడుకొని రాష్ట్రంలో అత్యధిక సభలు పెట్టాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది.బీజేపీ ముఖ్యంగా యువత,ఓటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టింది.విటీతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది.