బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైనవారికి డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. చాలా చోట్ల వీటి కోసం ఎదురుచూశారు. కొన్ని చోట్ల నాయకులు చేతివాటం చూపారు. లబ్దిదారుల నుంచి లక్షల రూపాయల్లో
దండుకున్నారు. మరికొన్ని చోట్ల రెండు పడకల ఇళ్లను నిర్మించింది కానీ, ఇంకా అందించలేదు. రాష్ట్రవ్యాప్తంగా వాటి నిర్మాణాలు చేపట్టలేదు. కొన్ని ప్రాంతాలను ఎంచుకుని స్వల్ప సంఖ్యలోనే ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్ల కోసం లబ్దిదారులు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మారినా ఆ పార్టీ నాయకులను వదిలిపెట్టేలా లేరు. బీఆర్ఎస్ నాయకులకు డబుల్ బెడ్రూం లబ్దిదారుల నుంచి నిరసన సెగలు తాకుతున్నాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు కొత్త కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ నేతకు కూడా ఈ సమస్య ఎదురవుతున్నది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు కూడా ఈ రోజు నిరసనలు ఎదురయ్యాయి. నివేదిత ఇంటి ముందు సుమారు 30 మంది వచ్చి బైఠాయించారు.
కంటోన్మెంట్ మాజీ శాసన సభ్యులు, దివంగత నాయకుడు సాయన్న డబుల్ బెడ్రూంల కోసం లబ్దిదారుల నుంచి రూ. 1.46 కోట్లు తీసుకున్నట్టు వారు చెబుతున్నారు. ఈ డబ్బులు ఇచ్చినప్పుడు లాస్య నందిత, నివేదితలు కూడా ఉన్నారని వాదిస్తున్నారు. కానీ, ఇప్పుడు సాయన్న, లాస్య నందిత మరణించారు. అయితే, నివేదితకు కూడా ఈ విషయం తెలుసు అని, తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయన్న మరణించడంతో అక్కడి నుంచి ఉపఎన్నికలో సాయన్న బిడ్డ లాస్య నందిత గెలిచారు. కానీ, ఆమె రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో సాయన్న రెండో బిడ్డ నివేదికతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కంటోన్మెంట్‌కు జరగనున్న ఉపఎన్నికలో నివేదిత పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్‌కు, మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా డబుల్ బెడ్రూంల నిరసనలు తాకాయి. ఎర్రవెళ్లి ఫామ్‌హౌజ్ ముందు డబుల్ బెడ్రూం లబ్దిదరులు నిరసనకు దిగారు. లాటరీ తీసి తమకు డబుల్
బెడ్రూంలు వచ్చాయని చెప్పారని, కానీ, చేతికి మాత్రం ఇవ్వలేదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బెడ్రూం లబ్దిదారులు వాపోతున్నారు. ఫామ్ హౌజ్ గేటు ముందు ధర్నా చేశారు. పీఏ శ్యామ్ వచ్చి వారి నుంచి వినతిపత్రాలు,
మొబైల్ నెంబర్లు తీసుకుని పంపించారు.ఇక హరీశ్ రావు కూడా అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి గజ్వేల్ వెళ్లినప్పుడు డబుల్ బెడ్రూం లబ్దిదారులు నిరసన చేశారు. పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి గజ్వేల్ వెళ్లగా.. అక్కడ తమకు డబుల్ బెడ్రూంలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.ప్రభుత్వానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చింది. అది సార్వజనీనంగా ఉండే పథకం. ఆ పథకం ద్వారా అందరూ లబ్ది పొందే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఇల్లు కోసం నిర్దేశించిన మొత్తాల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఇది వరకే ప్రకటించంది. కానీ, అందుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేవు.