పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు అడ్డుపడుతున్నారు. అదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి చేరికను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ చేరికకు స్థానిక పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో సంగిశెట్టి జగదీశ్, రంగారెడ్డి జిల్లాలో దండం రామ్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.పలు జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందు వస్తున్నప్పటికీ స్థానిక ముఖ్యనేతలు అడ్డు చెబుతుండటంతో వారి చేరికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా అన్ని స్థాయిల్లో నేతలను పార్టీలో చేర్చుకోవాలని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్న నేతలకు అడ్డుచెప్తే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని, ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారిని పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలకు వేణుగోపాల్ సూచించారు. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్న నేతలకు లైన్ క్లియర్ అయినట్లయింది. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక.. ప్రచారం వ్యూహం అంత బానే ఉన్నా.. సర్వే రిపోర్టులు మాత్రం కాస్త తేడా కొడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్‌పై పార్టీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.మూడు ఎస్సీ రిజర్వ్ సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికి, మరొకటి మాదిగ ఉపకులానికి దక్కడంతో.. సొంత పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు పిడమర్తి రవి వంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ అయితే మాదిగలకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ తూర్పారబట్టారు.
ఇక తక్కువ సీట్లు ఇచ్చారంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ తనకు ఖమ్మం నుంచి అవకాశం కల్పించాలని గట్టి పట్టు పడుతున్నారు.పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో
ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్. హైదరాబాద్ మినహా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం సీట్లలో బీసీ అవకాశాన్ని పరిశీలించాలని కోరారట. ఇప్పటికే పార్టీ కూడా బీసీ కులగణన చేసి ఆ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. రాజకీయంగా తగిన సీట్లు కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటితే.. టార్గెట్ రీచ్ కాలేమంటూ అధిష్టానానికి వివరించారట రేవంత్.