rahul
జాతీయం రాజకీయం

మిలిటరీ రిక్రూట్‌మెంట్ అగ్నీపథ్ పథకంపై రాహుల్ గాంధీ ఫైర్

 అగ్నీపథ్ మిలిటరీ రిక్రూట్‌మెంట్ పథకంపై మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం తూర్పారపడుతూ, ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో రూపొందించి, సాయుధ దళాలపై రుద్దారని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నీపథ్ మిలిటరీ పథకాన్ని రద్దు చేస్తుందని, పాత శాశ్వత రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తీసుకువస్తుందని రాహుల్ ప్రకటించారు.

‘అగ్నీపథ్ పథకం భారతీయ సైన్యానికి, దేశాన్ని రక్షించాలని కలలు కనే సాహస యువజనులకు అవమానకరం. ఇది భారతీయ సైన్యం పథకం కాదు. కానీ నరేంద్ర మోడీ కార్యాలయంలో రూపకల్పన జరిగిన పథకం. దీనిని సైన్యంపై రుద్దారు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు.‘అమరవీరులను విభిన్నంగా పరిగణించరాదు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే ప్రతి ఒక్కరికీ అమరవీరును హోదా ఇవ్వాలి’ అని ఆయన సూచించారు. ‘ఇండియా ప్రభుత్వం ఏర్పడగానే మేముఈ పథకాన్ని రద్దు చేసి, పాత శాశ్వత నియామక ప్రక్రియను తీసుకువస్తాం’ అని రాహుల్ తెలిపారు. సాయుధ దళాల్లో సిబ్బందిని స్వల్ప వ్యవధికి
చేర్చుకోవడానికి కేంద్రం 2022 జూన్‌లో అగ్నీపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పదిహేడున్నర ఏళ్లు, 21 ఏళ్ల మధ్య వయో వర్గంలోని యువజనులను నాలుగు ఏళ్ల కాలానికి రిక్రూట్ చేసుకునేందుకు, వారిలో 25 శాతం
మందిని మరి 15 సంవత్సరాలపాటు కొనసాగించేందుకు ఈపథకం అవకాశం కల్పిస్తుంది.