ఈ ఏడాది ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహాల నిమజ్జనాలు లేవని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ఉన్నాయా లేదా అన్నదానిపై అందరూ అయోమయంలో ఉండగా.. తాజాగా సీపీ ఆనంద్ దానిపై క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలను ఆపివేసినట్లు తెలిపారు.ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నిమజ్జనాల వేడుకలో 18 వేల మంది పోలీసులు పాల్గొంటారని వెల్లడించారు.వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనాలు కూడా అంతే వేడుకగా జరుపుతారు. ప్రతిఏటా ట్యాంక్ బండ్ పై హుస్సేన్ సాగర్ లో జరిగే నిమజ్జనోత్సవాలను చూసేందుకు వేలాదిమంది తరలి వస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఇక్కడ ప్రధానం.
హుస్సేన్ సాగర్ కాలుష్యమవుతోందని, PoP విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. 2021లో ఇచ్చిన ఆదేశాల మేరకే నిమజ్జనాలు చేయాలని స్పష్టం చేసింది.ఇక వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఒక విగ్రహానికి ఒక వాహనానికే అనుమతి. ఆ వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.
నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌ను అనుమతించరు.
రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టీ గన్స్ ఉపయోగించకూడదు.
మద్యం మత్తులో ఉన్న వారిని, మత్తు పదార్థాలు కలిగి ఉన్న వారిని విగ్రహం ఉన్న వాహనాల్లోకి అనుమతించరు.
రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు.
విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఆగకూడదు.
అప్పటి పరిస్థితి బట్టి వాహనాల రాకపోకలపై పోలీస్ అధికారులు ఆదేశాలిస్తారు.
ఊరేగింపులో ఎవరూ కర్రలు, కత్తులు, మారణాయుధాలు, మండే వస్తువులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లకూడదు.
జెండాలు, అలంకరణ కోసం పెట్టే కర్రలు 2 అడుగులకు మించకూడదు.
ఊరేగింపులో ఎలాంటి రెచ్చగొట్టే, రాజకీయ ప్రసంగాలు, నినాదాలు, రెచ్చగొట్టే సంకేతాలతో కూడిన బ్యానర్లు ఉపయోగించొద్దు.
ఏ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.
ఊరేగింపు సమయంలో బాణాసంచా కాల్చరాదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలి.