శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల క్షేత్రంలో ఇవాళ సీతారాముల కల్యాణం వైభవంగా కొనసాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారికి తెలంగాణ సర్కార్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు తెల్లవారు జామునే రామయ్య సుప్రభాత సేవను ఆలయ అర్చకులు జరిపారు. ఆ తర్వాత తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణ వేడుక నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి తీసుకెళ్లారు.ఇక, కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను శ్రీ రాముడికి, సీతమ్మకు, లక్ష్మణుడికి అర్చకులు ధరింపజేశారు.
కొత్త దంపతులైన శ్రీ సీతారామచంద్ర మూర్తులకు అర్చకులు నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్ర బెల్లం ఉంచి.. ఆ తర్వాత భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగళ్య ధరణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఇక, సీతారాముల కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించారు. కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో పాటు ఆలయ పరిసరాలన్నీ రామనామ స్మరణతో మార్మోగిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. అలాగే, రాములోరి కళ్యాణ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా.. సామాన్య భక్తుల్లా రాములోరి కళ్యాణాన్ని తిలకించారు.