first phase elections
జాతీయం రాజకీయం

మరి కాసేపట్లో తొలిదశ ఎన్నికలు

 తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 102 పార్లమెంట్ స్థానాల్లో మైకులు బందయ్యాయి. ఇక ఫస్ట్‌ ఫేజ్‌లో పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఒకేసారి 39 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో టైట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అలాగే…ఈవీఎంలతో పాటు ఇతర సామగ్రిని కూడా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.ఇక‌, తొలిద‌శ పోలింగ్ జ‌రిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్‌, మ‌ణిపూర్‌, మిజోరం, జ‌మ్ము కశ్మీర్‌ రాష్ట్రాలున్నాయి. ఇక మార్చి 16న ఇచ్చిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్రకారం దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు స్థానాల‌కు.. ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రగనుంది. అందులోభాగంగా ఫస్ట్‌ ఫేజ్‌ పోలింగ్‌ శుక్రవారం జరగనుంది.
బరిలో 8 మంది కేంద్ర మంత్రులు..
తొలిదశ పోలింగ్‌లో మొత్తం ఎనిమిది మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు. నాగ్‌పుర్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కర్, అరుణాచల్‌ వెస్ట్‌ నుంచి కిరణ్ రిజిజు, డిబ్రూగఢ్‌ స్థానం నుంచి సర్బానంద సోనోవాల్‌, అర్జున్‌ మేఘవాల్‌, ఎల్‌.మురుగన్‌ ఉన్నారు. త్రిపురలో రెండు స్థానాలుండగా, వెస్ట్‌ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ పోటీలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. చెన్నై సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.