లోక్ సభ ఎన్నికల సమరం తారస్థాయికి చేరింది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ, ఎలాగైనా పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. దక్షిణాదిలో బీజేపీ ప్రభావం ఉండదంటూ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దక్షిణ భారతదేశంలో పట్టు కోసం కష్టపడుతుందని, ఈ ప్రాంతంలోని 130 లోక్‌సభ స్థానాల్లో 15 కంటే తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేరళ.. తమిళనాడు, తెలంగాణ, ఏపీలో ఇలా అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాలలో తన ఉనికిని విస్తరించేందుకు సర్వశక్తులు ఒడ్డింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి.. గత కొన్ని వారాల నుంచి ఆ రాష్ట్రాలలో వరుస పర్యటనలు చేశారు.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలోని 130 సీట్లలో ఇండియా కూటమి 115 – 120 మధ్య కైవసం చేసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఓడించే ప్రయత్నంలో ఇది కీలకంగా మారుతుందని తెలిపారు. దక్షిణాదిలో 130 సీట్లు ఉన్నాయి.. బీజేపీకి 12 నుంచి 15 వచ్చే అవకాశం ఉంది.. మిగతావన్నీ ఇండియా కూటమికే దక్కుతాయి.. అంటూ అని కేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్‌కు చెందిన అదూర్ ప్రకాష్‌కు ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.