jagan-stone
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రాయి దాడి కేసులో నిందితుడు అరెస్ట్

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సతీష్ (ఏ1) అనే యువకుడిని విజయవాడ  అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురు అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే. అటు, సీఎంపై రాయి దాడి వ్యవహారానికి సంబంధించి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న వారి వివరాలు తెలపాలని న్యాయవాది సలీం ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, విజయవాడలో ఈ నెల 13న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తుండగా.. సీఎం జగన్ పై సింగ్ నగర్ వద్ద రాయి దాడి జరిగింది.

దీనిపై విచారించేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు.. చివరకు సతీష్ అనే యువకున్ని నిందితునిగా గుర్తించి అరెస్ట్ చేశారు.