medigadda
తెలంగాణ రాజకీయం

మేడిగడ్డకు రిపేర్లు.. బ్యారేజీ పునరుద్ధరణకు ఎల్‌అండ్‌టీ ఓకే?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్ డ్యామ్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించబోతున్నది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్‌ను సైతం ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసింది. దీనిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు నేతలంతా కౌంటరిచ్చారు.

పిల్లర్ల కుంగుబాటును రెండునెలల్లో సరి చేసి నీళ్లివ్వొచ్చని స్పష్టం చేశారు. పిల్లర్లు కుంగినా.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి.. నీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరమే నిర్మాణంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద పంపింగ్‌ను నిలిపివేయడంతో ఎండకాలంలో నీటి కొరత తీవ్రమైంది. పంటలు ఎండిపోవడంతో పాటు మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్‌అండ్‌టీ పునరుద్ధరణకు ముందుకు రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని అంతకు ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని.. అందులో లోపాలకు తాము బాధ్యులం కామని సంస్థ చెప్పింది. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సింది నిర్మాణ సంస్థనేనని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్‌అండ్‌టీ సంస్థ దిగివచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని ముందుకువచ్చినట్లు తెలుస్తున్నది.