తెలంగాణలో దక్కిన విజయంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ మీద కన్నేస్తోంది. ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఉత్తరాది లోని కీలక రాష్ట్రాల్లో తన పట్టు కోల్పోతున్న వేళ… తన పునరుజ్జీవాన్ని దక్షిణాది నుంచి ప్రారంభించా లనుకుంటోంది. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని అందుకోవడంతో, దక్షిణ భారతంపై ఆశలు పెరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకోవడంపై ఆ పార్టీ ఆలోచనలు చేస్తోంది.దక్షిణాదిలో బీజేపీ ఇంత తొందరగా పాగా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. కమలం బలమంతా ఉత్తరాదే. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ఓ పదేళ్ల కిందట వరకూ అవిభాజ్య ఆంధ్రలో అధికారాన్ని అనుభవించిన హస్తం పార్టీ, అడ్డగోలు రాష్ట్ర విభజనతో రెండు చోట్లా పరువు పోగొట్టుకుంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నేతల స్వయం కృతాపరాధం వల్ల మాత్రమే కాంగ్రెస్ మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఈ ఎన్నికలు కేసీయార్ పరాజయమే తప్ప… కాంగ్రెస్ ఘన విజయంగా శ్లాఘించాల్సిన అవసరం లేదు.
తెలంగాణలో తన పార్టీని పోటీకి పెట్టకుండా పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిన చంద్రబాబు మీదే సోనియా అండ్ కో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు కూడా రెండు జాతీయ పార్టీల ఆప్షన్లూ ఓపెన్‌గా ఉంచుకున్నారు. చివరి నిముషం వరకూ భాజపాతో పొత్తు కోసం ప్రయత్నించాలనుకుంటున్నారు. మూడు రాష్ట్రాల విజయంతో భాజపా మంచి ఊపు మీద ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించడం లేదు. చంద్రబాబుకు భాజపా ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. మోదీ, షాలను కన్విన్స్ చేయడానికి ఆయన పవన్‌ను కూడా వాడుకోవాలను కుంటున్నారు. ఆ రాయబారం కాంగ్రెస్‌ను తన కూటమిలో కలుపుకుంటారు. ఏపీలో చంద్రబాబు కాంగ్రెస్‌కు ఓ పది సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.ఇదే కనుక జరిగితే ఏపీలో మళ్లీ కాంగ్రెస్ జెండా రెపరెపలాడొచ్చు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు తప్ప ఆంధ్రకు ఎలాంటి ప్రయోజనం లేదు. విభజన చట్టంలో కూడా పోలవరం ఒక్కటే ఏపీకి దక్కిన వరం. హైదరాబాద్, నిధులు, నీళ్లు అన్నీ తెలంగాణకే సమకూరాయి.
ఇది సీమాంధ్రుల గుండెలపై ఆరని గాయం చేసింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్లీకి డిపాజిట్లు కూడా దక్క లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఏపీలో మళ్లీ చోటుంటుందా ఆనేదే అసలు ప్రశ్న. రాజకీయ పార్టీల తప్పులను ఐదేళ్లకే జనం సాధారణంగా మరిచిపోతుంటారు. ఘన విజయం సాధించిన పార్టీలు సైతం తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతుంటాయి. ఓడిన పార్టీలు గెలుస్తుంటాయి. ఏపీ విషయంలో కాంగ్రెస్ చేసింది చిన్న తప్పు కాదు. క్షమించరాని అన్యాయం. తెలుగుదేశంతో కలిసి పోటీ చేసినంత మాత్రాన అన్యాయం… న్యాయం అయిపోతుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.