rajasingh
తెలంగాణ రాజకీయం

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘన

నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌ ఫిర్యాదుమేరకు అదే పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 188, 290 రెడ్‌విత్‌ 34, సిటీ పోలీస్‌ యాక్ట్‌ 21/76 సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజాసింగ్‌ హనుమాన్‌ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఆయనపై కేసు నమోదైంది.వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్‌పై.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ సస్పెన్షన్‌ వేటువేసిన విషయం తెలిసిందే.

అయితే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొన్ని గంటల ముందు సస్పెన్షన్‌ ఎత్తివేసిన పార్టీ అధిష్ఠానం మళ్లీ ఆయననే గోషామహల్‌ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత పదవిని ఆశించారు. అయితే మహేశ్వర్‌ రెడ్డికి ఆ పదవిని అప్పజెప్పడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.