jagan-chiranjeevi
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిరంజీవి చుట్టూ ఏపీ రాజకీయాలు

ఒక్క జగన్ తప్ప వేరే నాయకుడిని ఒప్పుకునే స్థితిలో వైసిపి శ్రేణులు లేవు. వారికి నాయకుడంటే జగన్. జగన్ తప్ప మరే ఇతరులు ప్రజలకు మంచి చేయలేదు అన్నది వారి భావన. తమలాగే అందరూ జగన్ను గౌరవించాలి. ఆయనను ఆరాధించాలి. అంతేతప్ప విభేదించకూడదు. అంతకుమించి ఎదిరించకూడదు. తమ ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం కలవకూడదు. ఇది వైసిపి సగటు అభిమాని అభిప్రాయం. అయితే తాజాగా చిరంజీవి ఓ ఇద్దరు సన్నిహిత నేతలను ఆశీర్వదించారు. వారిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో వైసీపీ శ్రేణులు చిరంజీవిని టార్గెట్ చేసుకున్నాయి. పోసాని కృష్ణ మురళి బయటకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎవరు వచ్చినా పర్వాలేదు.. సింహం సింగిల్ గా వస్తుందని.. చిరంజీవిని అవమానించేలా మాట్లాడారు. దీనిపై స్ట్రాంగ్ గా పవన్ రియాక్ట్ అయ్యారు. అయితే గతంలో మూడు రాజధానుల అంశం విషయంలో చిరంజీవి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

అప్పట్లో చిరంజీవిని ఓన్ చేసుకోవడంలో వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ కు మించి జగన్ ను చిరంజీవి సోదరుడిలా భావిస్తున్నారని ఊరువాడ ప్రచారం చేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి సమస్యలపై జగన్తో చర్చలు జరిపినప్పుడు రహస్యంగా ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు.అయితే ఇప్పుడు అదే చిరంజీవి ఓ ఇద్దరు సన్నిహిత నేతలకు మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇందులో కీలక నేతలు, పోసాని వంటి వారు బయటకు వచ్చి మాట్లాడడం వ్యూహాత్మకమే అని తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన టిడిపి నేత పట్టాభి మాదర్చోత్ అనే పదాన్ని జగన్ పై వాడారు. అది రచ్చ రచ్చకు దారితీసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పై దాడి వరకు వచ్చింది. దీని వెనుక దేవినేని అవినాష్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి పైపై కేసుల నమోదుతో పోలీస్ అధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పట్లో జగన్ దీనిపై స్పందించారు. బీపీలు వస్తే ఇటువంటి ఘటనలు సహజం అని తేల్చి చెప్పారు.

అయితే ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేసుకోవడం పై పవన్ తో పాటు చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన నేపథ్యంలో మెగా అభిమానులు ఏకతాటి పైకి వచ్చారు. చివరకు వైసీపీని అభిమానించే చిరు అభిమానులు సైతం ఆలోచనలో పడ్డారు. అయితే మునుపటిలా జగన్ బీపీలు వస్తే.. ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పలేదు. అందుకే దిద్దుబాటు కోసం సజ్జల మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమకు చిరంజీవిపై ఎటువంటి కోపం లేదని.. బ్యాంకులను మోసం చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడారని.. అందుకే స్పందించాల్సి వచ్చిందని.. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని కూడా సజ్జల చెప్పుకొచ్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.