భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాల్లేవు. గతంలో ముఖ్యమంత్రి తరపున సీఎంవో ఖాతా ఉండేది. ఇప్పుడు మాజీ అయినందున ఆయన తన అభిప్రాయాలను తెలిపే సోషల్ మీడియా ఖాతా లేకుండా పోయింది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు.. తమ పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కనెక్టింగ్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండాలనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ లో తొలి పోస్టును టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది పోస్టు చేశారు. ఇతర సోషల్ మీడియాల్లోనూ కేసీఆర్ తన వ్యక్తిగత ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నేతలకూ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎక్స్ లో ఐదు మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కు రెండున్నర మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. టీ పీసీసీ చీఫ్ రేంత్ రెడ్డికి ఐదు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇలా అన్ని పార్టీల నేతలకూ సోషల్ మీడియాలో పాలోయింగ్ ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ సోషల్ మీడియా జోలికి వెళ్లలేదు.
రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావంపై కేసీఆర్ కు మొదటి నుంచి స్పష్టత ఉంది. ఆయన సోషల్ మీడియా ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ద్వారానే చాలా పనులు చక్క బెడతారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను కూడా పరిష్కరించేవారు. బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో మంచి ఫాలో యింగ్ ఉంది. పెద్ద నెట్ వర్క్ కూడా దేశ విదేశాల్లో బీఆర్ఎస్ కు ఉంది. ఓ టాపిక్ ను ట్రెండ్ చేసి.. నెంబర్ వన్ గా ఉంచగల స్థాయిలో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు బలం ఉంది. సోషల్ మీడియా ఖాతాల్లో ఇక పార్టీ పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు తెలిపే అవకాశాలు ఉన్నాయని అంచనా. కేసీఆర్ సోషల్ మీడియా ఖాతా గురించి చెప్పిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు.. ఫాలో కావడం ప్రారంభించారు.