జాతీయం

రికార్డు స్థాయిలో టెంపరేచర్….

ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. దీంతో జనాలను బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలుల తీవ్రతకు దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎండలు మండి పోతున్నాయి. వీటికి వడ గాలులు కూడా తోడు కావడంతో జనం నరకం చూస్తున్నారు. ఈ తరుణంలో సాధ్యమైనంతవరకు ప్రజలు ఇంటి వద్ద ఉండాలని.. అత్యవసరమైన పని ఉంటేనే బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే మూడు రోజుల్లో వడ గాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఇదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా 103 సంవత్సరాల రికార్డులు బద్దలయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. వాతావరణంలో మార్పులను సూచిస్తున్నాయని అధికారులు అంటున్నారు. 1921 కంటే ముందు ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే వచ్చే ఐదు రోజుల్లో ఈ వేడి మరింత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తూర్పు, దక్షిణ భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాదు మే నెలలో గతం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన ఎండల వల్ల పలు ప్రాంతాల్లో వడదెబ్బ మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో మండే ఎండల్లో బయటికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఇంటి వద్ద మాత్రమే ఉండాలని, ఏవైనా పనులు ఉంటే ఉదయం లేదా సాయంత్రం సమయంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ వేడిమి కి శరీరం నీరసానికి గురవుతుందని.. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పండ్ల రసాలు తాగాలని సూచిస్తున్నారు.