రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ తన సొంత మేనిఫెస్టోను ఆవిష్కరించారు. శనివారం (మే 4) రాత్రి నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద నగర ప్రముఖుల సమక్షంలో ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో ఈ మేనిఫెస్టోను రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు చేతుల మీదుగా ఆవిష్క రించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు, నగర ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం.. వారిలో పరివర్తన వచ్చిన తరువాత మళ్ళీ నగరంలోనికి అనుమతించడం.. నగర వాసులకు 24 గంటలూ మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు.
రివర్ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడం, గోదావరి బండ్ ను హైదరాబాదు టాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పంగా ఎంపీ తెలిపారు.స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్ మెంట్, ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్ళు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని అన్నారు. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి మాదిరిగా లాలా చెరువు, పిడింగొయ్యి, బొమ్మూరు, వేమగిరి జంక్షన్లలో కూడా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తానని ఎంపీ భరత్ ప్రామిస్ చేస్తూ నగర వాసులకు చెప్పారు. ఇవి కాకుండా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం తదితర మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.ప్రతి రోజు గుడ్ మార్నింగ్, రాజన్న రచ్చబండ కార్యక్రమాలు, వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీ భరత్ తెలిపారు. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలందిస్తానని, రాజమండ్రిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.