ముఖ్యాంశాలు

సైబర్ బాధితుల్లో అక్షరాస్యులే ఎక్కువ

రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో అధిక సంఖ్యలో చదువుకున్న వ్యక్తులే బాధితులుగా ఉంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి వస్తున్న కాల్స్ ను బట్టి వారి క్వాలిఫికేషన్లను నమోదు చేశారు పోలీసులు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లే బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా వారికి తెలియకుండానే వారి మొబైల్ ఫోన్లో నుండి డబ్బులు కాజేస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధి డేటాను పరిశీలిస్తే సైబర్ బారిన పడిన వారిలో సుమారు 38,000 మంది గ్రాడ్యుయేట్లు బాధితులుగా ఉన్నారు. వీరిలో నిరక్షరాశులు కేవలం 800 మంది మాత్రమే బాధితులుగా ఉన్నారు.నిరంతరం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సైబర్ కంట్రోల్ రూమ్ కు 1930 ద్వారా రోజుకు సుమారు 250 కాల్స్ వస్తున్నాయి.. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులే అధిక సంఖ్యలో మోసపోతున్నారు.

అన్ని తెలిసి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల సంబంధంలేని లింకులు క్లిక్ చేస్తూ మోసపోతున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు 30 వేలకు పైగా ప్రైవేటు ఉద్యోగులు తెలంగాణలో సైబర్ నేరగాళ్ల బారినపడి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులు యువతనే చేస్తుండటంతో వీరినే టార్గెట్ చేసుకున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా తమ టార్గెట్‌ను రీచ్ అవుతున్నారు. వృద్ధులు లేదా రైతులు తక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను వాడుతారు కాబట్టి వారు సైబర్ నేరగాల చేతిలో తక్కువగా మోసపోతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ సైబర్ మోసాలు జరుగుతున్న కమిషనరేట్లను పరిశీలిస్తే, మొదటి స్థానంలో ఉంది ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ ప్రాంతం . ఇక్కడ లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటారు.

సైబర్ మూసాలపై నిరంతర అవగాహన వీరికి ఉన్నప్పటికీ తెలిసి తెలియక చేస్తున్న చిన్న పొరపాటు వల్ల బాధ్యతులుగా మారిపోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 30 వేలకు పైబడి ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 24 వేల మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.