సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ గెలుపు కోసమే కొందరు పక్క పార్టీల్లో జంప్ చేస్తారు. టిక్కెట్ దక్కక కొందరు.. నాయకత్వాల తీరు నచ్చక మరికొందరు పక్క పార్టీల్లో చేరుతారు. గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. అయితే ఏపీలో మాత్రం ఈ ఎన్నికల ముందు చాలామంది నాయకులు పార్టీలను విడిచిపెట్టారు. పక్క పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఎదుట పార్టీల్లో చేరి టికెట్ పొందిన వారి గురించి ఒక సారీ తెలుసుకుందాం.
ఎన్నికలకు కొద్ది వారాల ముందే టిడిపిలో చేరారు రఘురామకృష్ణం రాజు. నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉంటూ బిజెపి టికెట్ ఆశించారు. కానీ టికెట్ భూపతి రాజు శ్రీనివాస శర్మకు దక్కింది. దీంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
* తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. కొద్ది వారాల ముందే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు పవన్ తిరుపతి సీటు ఇచ్చారు.
* 2019లో వైసీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచారు వల్లభనేని బాలశౌరి. ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
* భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులుఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకు టిడిపిలోనే ఉన్నారు. ఒత్తులు భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ నుంచి జంప్ చేశారు. టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు.
* అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ కొద్దిరోజులుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆయన జనసేనలో చేరారు. అనకాపల్లి టికెట్ దక్కించుకున్నారు.
* విశాఖ దక్షిణ నియోజకవర్గ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కొద్ది నెలల ముందే జనసేనలో చేరారు. ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు.
* విజయవాడ ఎంపీగా ఉన్న టిడిపి నేత కేసినేని నాని ఆ పార్టీతో విభేదించి వైసీపీలో చేరారు. చేరిన రోజే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.
* హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా జోలద రాసి శాంత పోటీ చేస్తున్నారు. ఆమె పార్టీలో చేరకముందే అభ్యర్థిత్వం ఖరారు కావడం విశేషం.
* మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు రాజకీయాలతో ఎంత మాత్రం సంబంధం లేదు. కానీ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు.
* గొల్లపల్లి సూర్యారావు టిడిపి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. దక్కకపోయేసరికి వైసీపీలో చేరారు. రాజోలు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు.
* తిరువూరులో టిడిపి నేత నల్లగట్ల స్వామి దాసు ఎన్నికలకు కొద్ది వారాల ముందే వైసీపీలో చేరారు. వైసిపి టికెట్ పొందారు. వైసీపీలో ఉన్న వాసంశెట్టి సుభాష్ కు టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. రామచంద్రాపురం టికెట్ దక్కించుకున్నారు.
* పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన టిడిపిలో చేరకముందే ఆ పార్టీ నూజివీడు టికెట్ను ఆఫర్ చేసింది.
* గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ టికెట్ను యార్లగడ్డ వెంకట్రావు ఆశించారు. దక్కకపోయేసరికి టిడిపిలో చేరి టికెట్ తగ్గించుకున్నారు.
* కర్నూలు జిల్లా ఆలూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం కు ఆ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. దీంతో టీడీపీలో చేరి గుంతకల్ అసెంబ్లీ టికెట్ తగ్గించుకున్నారు.
* మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఈయన టిడిపిలో చేరి అదే టికెట్ సొంతం చేసుకున్నారు.
* ఎన్నికలకు ముందు వరకు నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు వైసీపీలో ఉండేవారు. నాయకత్వంతో విభేదించి టిడిపిలో చేరారు. ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టికెట్, ప్రశాంతి రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ తగ్గడం విశేషం.
* చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన టిడిపిలో చేరారు. సత్యవేడు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. మొత్తానికైతే ఏపీ ఎన్నికల్లో దాదాపు ఒక 50 మంది నాయకులు పక్క పార్టీల్లోకి జంప్ చేసి టికెట్లు దక్కించుకున్నారు. వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.