అంతర్జాతీయం

దేశ ప్రజలకు క్షమాపణ తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని

వ్యాక్సినేషన్ నత్తనడకన నడుస్తుండడంపై విచారం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, దాని వల్ల కేసులు పెరుగుతుండడంపై ప్రజలకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 11 శాతం మందికే వ్యాక్సిన్లు అందాయి. ధనిక దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ అది. దీనిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

వ్యాక్సినేషన్ ఏమీ పరుగు పందెం కాదని ఒకప్పుడు అన్న ఆయనే.. ఇప్పుడు దిగొచ్చారు. ‘‘నేను విఫలమయ్యాను. ఈ ఏడాది ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయాను. అందుకు క్షమాపణలు కోరుతున్నా. టీకా కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగుతున్నందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఇప్పటికే ఎదురైన సవాళ్లన్నింటికీ నేనే బాధ్యుణ్ని. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉన్నాయి.. మరికొన్ని లేవు’’ అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సిడ్నీ, న్యూసౌత్ వేల్స్ లో రోజువారీ కేసులు పెరిగిపోతుననాయి. దీంతో సిడ్నీలో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. రాష్ట్రంలో కేసులు మరింత పెరిగే ప్రమాదముందని న్యూసౌత్ వేల్స్ అధ్యక్షురాలు గ్లేడిస్ బియర్జిక్లయన్ హెచ్చరించారు. కరోనా సోకినా చాలా మంది ఐసోలేషన్ లోకి వెళ్లట్లేదని, ఇలాంటి ప్రవర్తనలు చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందే వరకూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆంక్షలను తూచా తప్పక పాటించాలని సూచించారు.