- ఊహించని విధంగా ‘ఒమిక్రాన్’ వ్యాప్తి
- నెదర్లాండ్స్‌లో ఒక్కరోజే 13 కేసులు
- సరిహద్దులను మూసేసిన ఇజ్రాయెల్, మొరాకో
- టీకా కేంద్రాలకు పోటెత్తుతున్న అమెరికన్లు
- కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
- టెస్టులు పెంచాలంటూ రాష్ర్టాలకు మార్గదర్శకాలు
- అంతర్జాతీయ రాకపోకలపై కూడా పునఃసమీక్ష
- ఆంక్షల బాటలో కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ర్టాలు
కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని ఠారెత్తిస్తున్నది. వెలుగుచూసిన నాలుగు రోజుల్లోనే డజనుకు పైగా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ వేగాన్ని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. సరిహద్దులను మూసివేశాయి. విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలన్న నిర్ణయంపై పునఃసమీక్షించాలనుకుంటున్నది. కొత్త వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో పలు రాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వైరస్ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన 600 మందిలో 61 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని నెదర్లాండ్స్ అధికారులు తెలిపారు. ఇందులో కనీసం 13 మందిలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వేరియంట్ వెలుగుచూశాక ఒక దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. మరోవైపు, ‘ఒమిక్రాన్’ మొదట వెలుగుచూసిన దక్షిణ ఆఫ్రికాలోని పలు దేశాలపై ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఈయూ, ఇరాన్, జపాన్, న్యూజిలాండ్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, నేపాల్ తదితర దేశాలు నిషేధం విధించాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను దేశంలోకి అనుమతించబోమని ఆదివారం ఇజ్రాయెల్, మొరాకో వెల్లడించాయి. అయితే, వచ్చే నెలలో నిర్వహించనున్న విశ్వసుందరి పోటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొనడం గమనార్హం.
టీకాకు అమెరికన్ల పరుగు
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికాలో ఇంకా 30 శాతం మంది ప్రజలు కనీసం ఒక్క టీకా డోసు కూడా వేసుకోలేదు. అయితే ఇప్పుడు ‘ఒమిక్రాన్’ భయంతో టీకా వేసుకోవడానికి అమెరికన్లు పోటెత్తుతున్నారు. దీంతో దేశంలోని వందలాది టీకా కేంద్రాల్లో రద్దీ నెలకొన్నది. ‘ఒమిక్రాన్’ అమెరికాకు కూడా వ్యాపించి ఉండవచ్చని అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాసీ అన్నారు.
‘ఒమిక్రాన్’ వ్యాప్తి ఏ దేశాల్లో ఉన్నదంటే..
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్‌వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా ,బ్రిటన్
సమీక్షించాకే నిర్ణయం: కేంద్రం
అంతర్జాతీయ విమానాల రాకపోకలను వచ్చే నెల 15 నుంచి రాకపోకలను పునరుద్ధరించాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ‘ఒమిక్రాన్’ ఆందోళనల నేపథ్యంలో ఆదివారం హోంశాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన తర్వాతే విమాన సర్వీసుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే (ముఖ్యంగా ‘ఎట్ రిస్క్’ జాబితా దేశాలు) ప్రయాణికులకు పరీక్షలు, వారిపై నిఘాకు సంబంధించిన ఎస్‌వోపీ మార్గదర్శకాలపై కూడా నిర్ణయిస్తామన్నారు.
ఆంక్షల బాటలో రాష్ర్టాలు
మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసులు వేసుకోనివారు రాష్ట్రంలోకి రావాలంటే కరోనా టెస్టు చేయించు కోవాలని గుజరాత్ అధికారులు సూచించారు. గడిచిన నెలరోజుల్లో విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చిన వారందరూ కొవిడ్-19 టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని మధ్యప్రదేశ్ సర్కారు తెలిపింది.
టీకాల సమర్థత తగ్గొచ్చు: గులేరియా
‘ఒమిక్రాన్’ స్పైక్ ప్రొటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్టు తెలుస్తున్నదని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. దీంతో ఈ వేరియంట్ సులభంగానే రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఒమిక్రాన్’లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉండటం చేత ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థత తగ్గొచ్చన్నారు. కాగా, ‘ఒమిక్రాన్’ సోకిన రోగుల్లో తేలికపాటి లక్షణాలే కనిపించినట్టు దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.
‘ఒమిక్రాన్’పై రాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు
- విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరుపాలి. ముఖ్యంగా ‘ఎట్ రిస్క్’ జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి.
- ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలి.
- పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్. జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలి. ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీ సేకరించాలి.
- హాట్‌స్పాట్లతో పాటు అన్ని ప్రాంతాల్లో నిఘా, టెస్టుల సంఖ్యను పెంచాలి. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలి.