పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 14 మంది దరఖాస్తుదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు. బుధవారం సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.కాగా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది.మరోవైపు ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించినప్పటికీ భారత పౌరసత్వం మంజూరు నియమాలు రూపొందించడంతో జాప్యం జరిగింది. దీంతో ఈ చట్టాన్ని అమలు చేయడం నాలుగేళ్లు ఆలస్యమైంది. ఈ ఏడాది మార్చి 11న సీఏఏ కింద భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే సీఏఏతో పాటు ఈ చట్టం కింద ఒక మతం ప్రజలపై వివక్ష చూపడాన్ని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది.