జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నమా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైసీపీ విజయం.. సంచలనంగా మారుతుంది అని కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐ ప్యాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల ముందు నుంచి ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవిని వదులుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే.. సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ ను కలిసారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో ఆ ధీమా కనిపించలేదు. గతం మాదిరిగా ఐపాక్ టీం అధినేత రుషిరాజ్ సింగ్ ను జగన్ కలవలేదు. దీంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది.
అందుకే ఈరోజు జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సంద ర్శించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రేపు ఫలితాలను చూసి దేశం షాక్ కు గురవుతుందని చెప్పుకొచ్చారు. ఆసక్తికర ఫలితాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత, వంటి కారణాలతో వైసిపి శ్రేణులు డీలా పడ్డాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 81.86% ఓటింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ వరకు నువ్వా నేనాఅన్నట్టు సమరం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఓటింగ్ సైతం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో ఓటమికి అనుకూలమని ప్రచారం ప్రారంభమైంది. దీంతో జగన్ సైతం అలెర్ట్ అయ్యారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే.. ఓటింగ్ సరళి పై సమీక్షించి ఒక స్పష్టతకు వచ్చారు.ప్రభుత్వంపై వ్యతిరేకత, పెరిగిన పోలింగ్ వంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేసింది.
భారీ మెజారిటీ ఖాయమని లెక్కలు వేసింది. అయితే ఉదయానికే మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరడంతో వైసీపీలో ఆశలు చిగురించాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడంతో అదంతా ప్రభుత్వ వ్యతిరేకత అని కూటమి అంచనా వేసింది. విశ్లేషణలు కూడా అలానే వచ్చాయి. దీనికి తోడు అర్ధరాత్రి వరకు 1500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సంఘం అధికారికంగా లెక్కలు వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని 82% ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది.ఏపీలోని ప్రధాన నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడం, మహిళా ఓటింగ్ పెరగడంతో అధికార పార్టీ కొత్త అంచనాకు వచ్చింది. ఐప్యాక్ టీం, సోషల్ మీడియా విభాగంతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పోలింగ్ సరళి పై చర్చించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. కోటి 69 లక్షల మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారని.. వారితో పోల్చుకుంటే పురుష ఓట్లు ఐదు లక్షలు తగ్గాయని.. సంక్షేమ పథకాల ప్రధాన లబ్ధిదారులు మహిళలు కావడంతో.. వారు తప్పకుండా వైసీపీ వైపు మొగ్గు చూపుతారని జగన్ ఒక లెక్కకు వచ్చారు.
టిడిపి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో సైతం మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారని భావిస్తున్నారు. ఈ ధైర్యంతోనే జగన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సాగిన పాలన.. మరింత మెరుగ్గా సాగుతుందని హామీ ఇచ్చారుఈ నేపథ్యంలోనే జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. కేవలం వైసీపీ ఓటమి చెందుతుందని వస్తున్న విశ్లేషణలు, ప్రచారానికి చెప్పేందుకే జగన్ కీలక ప్రకటన చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే జగన్ ప్రకటనతోవైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.