ఫలితాల తర్వాత కూడా ఏపీలో అల్లర్లు జరుగుతాయా? కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక దేనికి సంకేతం? అధికార పార్టీ ఓడిపోయి అల్లర్లకు దిగుతుందా? లేకుంటే గెలిచామని అధికార పార్టీ విపక్షాలపై దాడి చేస్తుందా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో పోలింగ్ నాడు చాలా ప్రాంతాల్లో హింస రేగిన సంగతి తెలిసిందే. అది రెండు రోజులపాటు కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ సీరియస్ చర్యలతో పాటు కేంద్ర బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఫలితాల తరువాత హింస మరింత పెరుగు తుందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఫలితాల తర్వాత రెండు వారాల పాటు కేంద్ర బలగాలు ఏపీలో కొనసాగనున్నాయి. ఏపీలో అధికార పార్టీ ఓడిపోతే.. ఆ ఫ్రస్టేషన్లో దాడులు జరిగే అవకాశం ఉంది. గెలిచామన్న ఆనందంలో తెలుగుదేశం కూటమి శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉంది. అంటే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు వైసిపి ఓడిపోతుందన్న సంకేతాలు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు చాలా చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
చాలా చోట్ల రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అటు కొంతమంది సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు భయంతో కూడుకున్నవే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం అల్లర్లు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసిందంటే.. వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని.. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అల్లర్లకు తెగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా టిడిపి శ్రేణులు నిలబడ్డాయి. వైసీపీ అధికారంలోకి వస్తే టిడిపి శ్రేణుల అంతు చూద్దామని.. భావనలో వైసీపీ శ్రేణులు ఉండొచ్చని.. అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని కూటమి పార్టీల ధీమా.. అధికార వైసీపీ శ్రేణుల నుంచి వినిపించడం లేదు.
పోలింగ్ పెరగడం, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకించడం, యువత పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతో ఒక రకమైన అనుమానం అధికార పార్టీలో ఉంది. అందుకే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో ఎక్కువగా వైసీపీ భయపడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఉత్తరాదిని మించి
ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా రాజకీయ హింస చెలరేగింది. పోలింగ్ నాడు ప్రారంభమైన హింస.. రెండు రోజుల తర్వాత కూడా కొనసాగింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు సినిమాల్లో చూడడం తప్ప.. నేరుగా చూడడం ఇదే తొలిసారి. దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. జాతీయస్థాయిలో ఏపీ పరువు పోయింది. కేంద్ర బలగాలు మొహరించాయి. ఫలితాలు వచ్చాక రెండు వారాలపాటు ఏపీలో ఈ బలగాలు కొనసాగనున్నాయి.ఏపీలో పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్రలు రాళ్లతో దాడులు జరిగి ఆయా ప్రాంతాలు రక్తసిక్తంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. జనాలు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఫలితాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితికి ముమ్మాటికి పోలీస్ శాఖ తీరే కారణం. కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులోత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగానే పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకొని ఉంటే హింస ఈ స్థాయిలో పెరిగి ఉండేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్.. రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు బీహార్ కు ఉన్న అపవాదు ఏపీకి విస్తరించే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ నాడు చెదురు మదురు ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ పోలింగ్ నాడే పరిస్థితి అదుపు తప్పింది. తరువాత రెండు రోజులపాటు అలానే కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ కలుగజేసుకోవడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజులను తలుచుకుంటే రాష్ట్రం ఎలా మార బోతుందోనన్న ఆందోళన రెట్టింపు అవుతోంది. కచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏపీలో జరిగే నష్టానికి మూల్యం తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.