ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పిఠాపురానికి మహర్ధశ

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు దాదాపు ఒక స్పష్టతకు వస్తున్నారు. గట్టి ఫైట్ ఉన్న నియోజకవర్గాలను తప్పించి… మిగిలిన వాటిలో మాత్రం గెలుపు, ఓటమి పైన అభ్యర్థులు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తున్నారు. కానీ ఫలితం ప్రకటించే వరకు గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీలో హాట్ నియోజకవర్గంగా పిఠాపురం నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్… ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు గట్టిగానే ప్రయత్నం చేశాయి. అయితే రాష్ట్రస్థాయిలో ఫలితం ఎలా వచ్చినా.. పిఠాపురం నియోజకవర్గానికి కీలక పదవి ఖాయమని తేలుతోంది. ఇప్పటికే వంగా గీతను గెలిపిస్తే మంత్రితో పాటు డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆమెకు పాలనపరంగా కూడా మంచి అనుభవం ఉంది.2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు.

రాజ్యసభ సభ్యురాలిగా, గత ఎన్నికల్లో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఒకవేళ ఆమె గెలిచి.. ఏపీలో వైసిపి అధికారంలోకి వస్తే వంగా గీత తప్పకుండా మంత్రి అవుతారు. డిప్యూటీ సీఎం పదవి తగ్గించుకుంటారు. కీలక పోర్టు పోలియో తప్పదు. ఒకవేళ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి పవన్ గెలుపొందితే.. ఆయనకు కీలక మైన మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమిలో పవన్ పాత్ర కీలకం. చంద్రబాబు తప్పనిసరిగా ఆయనను క్యాబినెట్ లోకి తీసుకోవడం ఖాయంగా తేలుతోంది. అటు పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. వంగా గీత ఓడిపోయి వైసిపి అధికారంలోకి వచ్చిన ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఖాయం. అదే సమయంలో పవన్ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చినా.. ఆయనకు సైతం అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే పవన్ 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అటు కూటమికి సైతం సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ డిప్యూటీ సీఎం పదవి చేపడితే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఇటు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినా పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం కీలక పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.