కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అవినీతి అక్రమాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాటికొండ రమేష్ అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఉంటున్న లాడ్జి గది నుంచి ముఖ్యమైన ఫైల్స్ మాయమయ్యాయని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారి మంగళవారంం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు.ప్రొ.రమేష్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి విజిలెన్స్ విచారణ కొరకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అదే రోజు విద్యా శాఖ కార్యదర్శి కేయూ రిజిస్ట్రార్ మల్లా రెడ్డికి ఎటువంటి ఫైల్స్ ముట్టకూడదని మౌఖిక ఆదేశాలిచ్చినట్టు ఇస్తారి తెలిపారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యూనివర్సిటీ నుంచి పలు ఫైళ్లు బయటకు వెళ్లాయని ఇస్తారి ఆరోపించారు.
విషయం తెలుసుకున్న అకుట్ కమిటీ పరిపాలన భవనానికి చేరుకొని రిజిస్ట్రార్‌ను నిలదీసినట్లు తెలిపారు. వీసీ రమేష్ గత నాలుగు రోజుల నుంచి కేయూకు రావట్లేదని, విజిలెన్స్ విచారణలో అవసరమయిన ఫైళ్లను తారుమారు చేసేందుకు ఇంటికి తరలించారని ఆరోపించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ఫైళ్లను బయటకు తీసుకు వెళ్లడంపై ఇస్తారి అనుమానం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో వీసీ తన పాలనను లాడ్జీ నుండే కొనసాగించారని ఆరోపించారు. లాడ్జి నుంచి తరలించిన ఫైళ్లలో పలు మార్పులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వివిధ డీన్ల వద్ద నున్న పీహెచ్‌డీ, పార్ట్ టైం ఫుల్ టైమ్ అడ్మిషన్లకు సంబంధించిన ఫైళ్లు, విద్యార్థులకు వచ్చిన మార్కుల లిస్ట్, కంప్యూటర్ కొనుగోలుకు సంబంధించిన అప్రూవల్ ఆర్డర్లను మార్చే అవకాశం ఉందని ఇస్తారి ఆరోపించారు. వీసీకి సంబంధించిన సొంత పుస్తకాలు, మెమెంటోలు, వ్యక్తిగత సామానులు తీసుకువెళ్లి ఉండొచ్చని రిజిస్ట్రార్ చెప్పిన మాటలను ఆకుట్ ఖండిస్తుందని ఇస్తారి చెప్పారు.
వీసీ ఉన్న లాడ్జి సీసీ ఫుటేజీని విడుదల చేసి ఫైళ్లు మాయం చేసిన వారిని శిక్షించాలని రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మే 18న ఆదేశాలు జారీ చేశారు.
వర్సిటీ టీచింగ్ స్టాఫ్ సంఘం జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ గత మూడేళ్లలో వీసీ ప్రొ. తాటికొండ రమేష్ టీచర్లు, విద్యార్థుల వ్యతిరేక విధానాలను అనుసరించారని ఆరోపించారు. ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో కేయూ పాలక మండలికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.