జాతీయం

రేవ్ పార్టీలోని 103 మందిలో 86 మందికి డ్రగ్‌ పాజిటివ్గా నిర్ధారణ

కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లు పోలీసులు ఇదివరకే వెల్లడించారు. వీరితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు, అలాగే మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా పట్టుబడిన వారి రక్త నమూనాలు సేకరించి ఇటీవల వైద్య పరీక్షలకు పంపగా, 103 మందిలో 86 మందికి డ్రగ్‌ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు, వారిలో తెలుగు నటి సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ నటి హేమేనా?
అయితే డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిన వారిలో తెలుగు నటి ఉన్నారని వెల్లడించిన కర్ణాటక పోలీసులు, ఆమె పేరు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే రేవ్ పార్టీ విషయం వెలుగులోకి రాగానే, అందులో తెలుగు నటి హేమ పాల్గొన్నారంటూ పలు వార్తా ఛానళ్లు ప్రసారం చేశాయి. వాటిపై స్పందించిన హేమ ఆ వార్తలను ఖండించారు. తాను ఆ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఓ రిసార్ట్లో చిల్ అవుతున్నా నంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని స్పష్టం చేశారు. తాను బెంగళూరు పార్టీకి వెళ్లలేదంటూ ఆమె రికార్డు చేసిన వీడియో ఎక్కడ తీశారో దానిపైనా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆ నటి హేమే అయ్యి ఉంటారని జోరుగా చర్చ నడుస్తోంది.