ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తడబాటులో వైసీపీ…

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. అగ్రనేతలు రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం హైవోల్టేజ్ లో సాగుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇవి నియోజకవర్గానికి పరిమితం కావడం లేదు. మొత్తం రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. పోలింగ్ రోజున ఓ పోలింగ్ బూత్ లో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగులగొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాల చుట్టూ రాజకీయం ముదిరిపోయింది. అప్పటికే అల్లర్ల అంశంపై సిట్ విచారణ జరగుతూండటం, పిన్నెల్లి సోదరులు ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరగడంతో అసలు రాజకీయం ప్రారంభమయింది. ఈవీఎం పగులగొడుతున్న దృశ్యాలు జాతీయ మీడియాలో సైతం వైరల్  కావడంతో ఈసీ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాల్సిందేనని నోటీసులు పంపింది. దీంతో పిన్నెల్లిని తప్పనిసరిగా అదుబులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల నుంచి రెండు, మూడు చానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులకు తప్ప ఎవరికీ అందుబాటులో లేరు.

మాచర్ల అల్లర్ల విషయంలో ఆయనను అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ హఠాత్తుగా ఈవీఎంల ధ్వంసం వీడియో వెలుగులోకి రావడం.. అది సంచలనంగా మారడంతో  పోలీసులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఉదయమే ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ కు వెళ్లారు. మామూలుగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లోనే సరెండర్ అవ్వాల్సింది. ప్రతి రాజకీయ నాయకుడు చేసే పని అది. పారిపోయే ప్రయత్నం అసలు చేయరు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పరారీలో ఉన్నారు అని అనిపించుకోవడానికి ఇష్టపడరు. కనీసం ఆజ్ఞాతం అనే గౌరవ ప్రమాదమైన మాట వరకూ వెళ్తారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం పరారీ వరకూ వెళ్లింది. బుధవారం అంతా పిన్నెల్లి అరెస్టు విషయం  ధ్రిల్లర్  తరహాలో సాగింది.  మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు.

తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్ాయయి.  తర్వాత అరెస్ట్ చేశారని మీడియాకు లీక్ వచ్చింది. చివరికి డీజీపీ హరీష్ కమార్ గుప్తా త్వరలో అరెస్టు చేస్తామని ఈసీకీ నివేదిక పంపారు.   ఐదు గంటల కల్లా అరెస్ట్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించిన సీఈసీకి అరెస్టు చేశామన్న నివేదికను పంపలేకపోయారు.  లుకౌట్ నోటీసులు జారీ చేసినందున విదేశాలకు పోయే చాన్స్ లేదు.  పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు పెట్టామని ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని సీఈవో మీనా చెప్పారు. మొత్తంగా రోజంతా హైడ్రామా నడిచింది. పరారీ అవుతుంటే పట్టుకున్నామని పోలీసులు చెప్పడం ఎవరికైనా ఎబ్బెట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అయితే ఇంకా ఎక్కువ ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే పోలీసులు తమ దాకా వస్తే ఎప్పుడూ వారిని తప్పిచుకుని పోవాలనిరాజకీయ నేతలు అనుకోరు. అరెస్టు కావడానికే ప్రాధాన్యం ఇస్తారు. తాము తప్పు చేయలేదని న్యాయపోరాటం చేస్తారు.

ఇక్కడ పిన్నెల్లి కూడా అదే చేస్తారని అనుకున్నారు.కానీ ఆయన అనూహ్యంగా పరారీ బాట పట్టారు. ఎంతగా అంటే విదేశాలకు వెళ్లిపోతాడని. అంత అవసరం ఏముందో వైసీపీ క్యాడర్ కూడా అర్థం కాదు. ఎన్నికల సమయంలో గొడవల కేసులు కఠినంగా కనిపిస్తాయి కానీ.. అవి సులువుగా తేలిపోతాయి. ఈవీఎం ధ్వంసం కేసులో మ్యాగ్జిమం శిక్ష రెండు నుంచి మూడేళ్ల జైలు శిక్ష. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడే కేసుల విషయంలో అరెస్టులు ఉండవు. స్టేషన్ బెయిల్ ఇస్తారు. కానీ న్యాయపరమైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయకుండా పిన్నెల్లి పరారీ కావడం తీవ్రతను ఆటోమేటిక్ గా పెంచిందని అనుకోవచ్చు. పిన్నెల్లిని సమర్థించడానికి కూడా వైసీపీ నేతలు తంటాలు పడ్డారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేశారని పగుల గొట్టారని ఎక్కువ మంది వాదిస్తూ తెర ముందుకు వచ్చారు. పిన్నెల్లి పారిపోయాడని.. పట్టుకోలేకపోయామని పోలీసులు చెప్పిన తర్వాత గురజాల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లికి మద్దతుగా పార్టీ తరపున బలమైన వాదన వినిపించే  ప్రయత్నం చేశారు.

అది మరీ అరెస్టు చేయాల్సింత కేసు కాదని ఆయన చెప్పదల్చుకున్నారు. కానీ చెప్పే విషయంలో తేడా రావడం.. అప్పటికే పిన్నెల్లి పారిపోయారని ఉద్ధృతంగా ప్రచారం జరగడంతో కాసు మహేష్ రెడ్డి వాదన కూడాచాలా మందికి వింతగా అనిపించింది. అలాగే  మంత్రి అంబటి రాంబాబు ఆ వీడియో ఫేక్  కావొచ్చునని వాదించి మరింత విమర్శలకు గురయ్యేలా చేశారు. పిన్నెల్లి న్యాయపరమైన అవకాశాలను వెదుక్కుని ఉంటే.. వైసీపీకి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండేది. కానీ పరారు కావడం వల్ల ఎలాంటి వాదన వినిపించినా ప్రజల్లోకి మాత్రం భిన్నంగా వెళ్తోంది. పార్టీ ముఖ్య నేతలందరూ హాలీడే మూడ్ లో ఉండటంతో పిన్నెల్లి ఇష్యూని సరిగ్గా డీల్ చేయలేకపోయినట్లుగా మారింది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు తప్పు దిద్దుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.