ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తాడిపత్రిలో మంటలు ఆర్పేదెవరు

మాచర్ల నియోజకవర్గంలో కేసులు నమోదయ్యాయి. పల్నాడులో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేవలం పల్నాడు మాత్రమే కాదు.. తాడిపత్రిలోనూ ఇదే తరహాలో ఘటనలు జరిగాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. అక్కడ కూడా పెద్దయెత్తున ఘర్షణలు చెలరేగాయి. అయితే అక్కడ కూడా పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపైనా, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారిని ఇంతవరకూ అదుపులోకి తీసుకోలేదు. మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారన్న కారణంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతోనే ఆయనకోసం వేట మొదలుపెట్టారు. కానీ తాడిపత్రిలో అలా కాదు. ఇద్దరు పెద్దమనుషులను గౌరవంగా ఇతర ప్రాంతాలకు పోలీసులే తరలించారు. ఎందుకు వారిని అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.

కౌంటింగ్ సమయంలో తిరిగి ఘర్షణలు చెలరేగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించినా వారిని గృహనిర్భంధానికే పరిమితం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులే దగ్గరుండి హైదరాబాద్ లో వదిలేసి వెళ్లిపోయారు. నిజానికి పల్నాడు కు మించి తాడిపత్రిలో కౌంటింగ్ రోజు ఘర్షణలు తలెత్తే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. అక్కడ అదనపు బలగాలను కూడా ముందుగానే దించారు. పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. కానీ అక్కడి ఘర్షణలు నివారించ డానికి ఈ బలగాలు సరిపోతాయా? అన్నదే అసలు ప్రశ్న. గ్రామాల్లో ఇప్పటికీ సమయం కోసం రెండు వర్గాలు వేచి ఉన్నాయి. వారి మధ్య అడ్డుగోడ నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అదే ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా ఆందోళన చెందుతున్న విషయం. గెలుపోటములు పక్కన పెట్టి మరీ గొడవలకు దిగడం అక్కడ సాధారణం కావడంతో పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి.

నేతల ఫోన్ల దగ్గర నుంచి వారి ప్రధాన అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది.ఎన్నికల కౌంటింగ్ ఇంకా పదకొండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ పన్నెండు రోజులే కాదు.. కౌంటింగ్ రోజు తర్వాత కూడా అక్కడ బితుబితుకు మంటూ బతుకీడవాల్సిందే. ఎన్ని రోజులనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదు. ఆ బాధ్యత రాజకీయనేతల పైన కూడా ఉంటుంది. ప్రధానపార్టీల అగ్రనేతల నుంచి స్థానిక నేతల వరకూ తమ అనుచరులను కంట్రోల్ చేేయగలిగితేనే పరిస్థితులు సానుకూలంగా మారతాయి. ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అంతే తప్ప కేవలం పోలీసుల మీద నెపాన్ని నెట్టేసి నేతలు పగలు, ప్రతీకారం అని కూర్చుంటే ఎక్కడైనా సరే రాజేసిన మంటలు ఆరిపోవు. అలాగే అమాయకుల బలవుతూనే ఉంటారు. సామాన్య ప్రజలు ఇక్కట్లు పాలవుతూనే ఉంటారు. అందుకే నేతలు ఇప్పటికైనా మేల్కొని శాంతి జెండా ఎగురవేయాలని అందరూ కోరుతున్నారు.