ఒకప్పుడు హీరోగా అలరించి ఇప్పుడు విలన్ పాత్రలతో మెప్పిస్తున్న నటుడు జగపతి బాబు. కథానాయికుడిగా అనేక చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్కు దగ్గరయ్యారు. గతంలో అనేక సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్న ఆయన కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోగా కనిపించిన జగపతి బాబు ఆ తర్వాత విలన్ పాత్రలో అదరగొట్టేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ మూవీలో కనిపించిన జగపతి బాబు… ఇప్పుడు సలార్ 2 ప్రాజెక్టులోనూ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రోజూ ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటున్నాడు.
తాజాగా జగపతి బాబు రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేశారంటూ ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. “ఇటీవల రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను. నన్ను కూడా వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరనేది త్వరలోనే చెప్తాను. ల్యాండ్ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్తపడండి. ఎవరి ట్రాప్ లో పడొద్దు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగపతి బాబు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవు తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన జగపతి బాబుకు ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
అప్పట్లో కుటుంబకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చు కున్నాడు. చివరగా గుంటూరు కారం సినిమాలో కనిపించిన జగపతి బాబు.. ఇప్పుడు మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.