ఆంధ్రప్రదేశ్

12 ఏళ్లు దాటితే… నో ఎంట్రీ

12 ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు గాను టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్‌రోడ్లపై గతంలో ఎప్పుడూ లేనట్లుగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ  అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్లలో చిన్నపాటి ప్రమాదాలు జరగడం కామన్. కానీ పదుల సంఖ్యలో భక్తులతో వెళ్తున్న బస్సు, టెంపో లాంటి వాహనాలు పల్టీలు కొట్టడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. అయితే ప్రమాదాలకు వాహనదారులు కారణమా.. ఘాట్ రోడ్లలోనే మార్పులు చేయాల్సి ఉందా అన్న చర్చ జరుగుతోంది.

తిరుమల ఘాట్‌లో ప్రమాదాలకు స్పీడ్ లిమిట్ నిబంధనలను ఎత్తివేయడం కూడా ఒక కారణమని తెలు స్తోంది. గతంలో అలిపిరి నుంచి తిరుమలకు ప్రయాణ సమయం 28 నిమిషాలుగా ఉండేది. తిరుమల నుంచి అలిపిరికి వచ్చే సమయం 40 నిమిషాలు ఉండాలన్న నిబంధనలు అమలు చేశారు. అంతకంటే వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకునేవారు. ఓవర్ స్పీడ్, నిబంధనలు ఉల్లంఘించారని ఫైన్లు వేసేవారు. కొద్ది నెలల క్రితం ఈ స్పీడ్ లిమిట్ నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి డ్రైవర్లు వాహనాలను ఓవర్ స్పీడ్ తో నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కొందరు డ్రైవర్లు ఓవర్‌టేక్‌ లు చేస్తూ.. అడ్డగోలుగా హారన్స్ Horons కొడుతూ ఇతర వాహనాలను ఇబ్బంది పెడుతున్నట్టు తేల్చారు. ఈ సమయంలో అయోమయానికి గురై స్పీడ్ ను కంట్రోల్ చేయలేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు.తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి.

కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. ప్రతిరోజు 9 నుంచి 10 వేల కార్లు రెండవ ఘాట్ రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. మరో 3వందల వరకు ఆర్టీసీ బస్సులు తిరుమల.. తిరుపతి మధ్య ప్రతిరోజు భక్తులను తరలిస్తాయి. ఇక టూవీలర్ల రాకపోకలు అయితే వేల సంఖ్యలోనే ఉంటాయి. కరోనా తరువాత తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో పాటు వాహనాల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరిగింది. ప్రతిరోజు తిరుమలలో 20 వేల వాహనాలు ఉంటాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు.రోజురోజుకు తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. భక్తులతో పాటు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్ లో మే 28న ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సు పల్టీలు కొట్టకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అదే విధంగా మొదటి ఘాట్ రోడ్డులో 6వ మలుపు దగ్గర కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ వాహనం అది తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో కూడా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో మరో వాహనం ప్రమాదానికి గురైంది..మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ , వేగంగా వాహనాలు నడపడం, నిద్రలేమి , ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డులో ఫిట్ నెస్ లేని వాహనాలు ప్రమాదాలకు కారణంగా మారుతన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో 12 ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతి ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది.