ఆంధ్రప్రదేశ్

నిలువునా ముంచుతున్న నకిలీ విత్తనాలు

నకిలీ విత్తనాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. తక్కువ ధరకు వస్తు్న్నాయనే ఆశతో కొనుగోలు చేసి నష్టాలపాలౌతున్నారు. వేసవి దుక్కులు ప్రారంభం నుంచే నకిలీ మాఫియా తమ కార్యకలాపాలను విస్తరింప జేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏడాదికేడాది అసలు విత్తన కంపెనీలను పోలినట్లుగా తయారు చేస్తూ.. ప్యాకింగ్ లో ఎలాంటి తేడా లేకుండా జాగ్రత్త పడుతూ వాటిని రైతులకు అంటగడుతున్నారు. ఫలితంగా రైతులు నిలువునా మునుగుతున్నారు. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. కొందరు బస్సులు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న వారిని విజిలెన్స్, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పట్టుకుంటున్నారు. అయితే వీటిని పూర్తిస్థాయిలో నకిలీ విత్తనాలకు బ్రేకులు వేయడం లేదనే విమర్శలున్నాయి. వేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజక వర్గాలు, 57 మండలాలు, 921 రెవెన్యూ గ్రామాలు, 993 పంచాయతీలున్నాయి.

40.52 లక్షల జనాభా, 9.06 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ కు ముందుగానే నకిలీ విత్తనాలు మాఫియా పుణ్యమానీ పురుడు పోసుకుని రైతులను నట్టేటా ముంచేందుకు సిద్ధం చేస్తోంది. మే మాసం చివరి వారం నుంచే ఈ తంతు ప్రారంభించి జూన్ మాసంలో రైతులకు అంటగడుతోంది. రైతులు తొలకరి చినుకులు పడగానే విత్తనాలు వేసి దిగుబడి కోసం ఎదురు చూసే సమయానికి నష్టపోయామని తెలిసి బోరున విలపించడం అనవాయితీగా మారింది. ఉమ్మడి జిల్లాలో 20 నుంచి 40 జిన్నింగ్ మిల్లులు ఉండడం, ప్రముఖ వ్యాపారులు సీడ్ఆర్గనైజర్ల పేరిట మాఫియాగా ఏర్పడి నాసీరకం విత్తన సరఫరా చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సామ్రాజ్యాన్ని విస్తరించి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది నకిలీ పత్తి విత్తన వినియోగంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాదిఎకరాల్లో పంటను కోల్పోయారు.

సీడ్ ఆర్గనైజర్లు,దళారులు, దుకాణ దారులతో కూడిన మాఫియా పటిష్ట నెట్వర్క్ ను ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను సజావుగా సాగిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వాటిని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.విత్తనోత్పత్తి క్రమంలో నాణ్యతపై లేబొరేటరీల్లో పరీక్షించాలి. వ్యవసాయా ధికారి మూడుసార్లు తనిఖీ చేయాలి. ఈ పంటలను ప్రత్యేకంగా కోసి ప్రాసెసింగు తీసుకురావాలి. వీటిని డీఎన్ఏ పరీక్షలో గానీ, గ్రోఔట్ ద్వారా పరీక్షించి నాణ్యతను, జెనెటిక్ ప్యూరిటీని నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా 98-99 శాతం నాణ్యత లేకపోయినా అది నాసీరకం కిందరకు వస్తుంది. విత్తనాల్లో మొలక శాతం 65 నుంచి 90 వరకు ఉండాలి. పత్తిలో మొలకశాతం 75 ఉండాలి. అంతకంటే తక్కువుంటే నాసీరకం గానీ, నకిలీ కింద లెక్కగడుతారు. అలాగే పత్తిలో బీటీ ప్రొటీన్ 90 శాతం ఉండాలి. ఈ మేరకు నాణ్యత ఉన్న వాటినే కంపెనీలు రైతులకు విక్రయించాలి.అంతేకాకుండా విత్తనాల ప్యాకెట్ల లేబుల్ పై ఆ విత్తనం నిర్దేశిత ప్రాంతానికిసరిపోతుందో లేదో విశదీకరించాలి.

నాణ్యత శాతం, మొలక, తేమ శాతం, పత్తికి బీటీ ప్రొటీన్ శాతం వంటివి ఉండేలా చూడాలి. లాట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. పత్తికి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ధ్రువీకరణ ఉండాలి. ఇవి ఉంటేనే నాణ్యమైన విత్తనంగా గుర్తిస్తారు. జనరల్ సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రయివేట్ వెరైటీలకు ఆయా కంపెనీల స్వీయ ధ్రువీకరణ చేసుకుంటే చాలు లైసెన్స్ వచ్చినట్టే. ఆ విధంగా విత్తన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. అయితే స్వీయ ధ్రువీకరణ, విత్తనోత్పత్తి మీద నియంత్రణ విత్తన చట్టంలో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని కంపెనీలు నకిలీ వరిలో విత్తన దందాకు తెరతీస్తూ రైతుల్ని నట్టేట ముంచు తున్నాయి. అక్రమార్కులు, వ్యాపారులు కుమ్మక్కై నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేని విత్తనాలను, గడువు ముగిసిన విత్తనాలను, స్థానికంగా తయారు చేసిన విత్తనాలను పెద్ద ఎత్తున రైతులకు అంటగడుతూ విత్తన మాఫియా జేబులు నింపుకుంటోంది. ప్రభుత్వ విత్తనాలు చాలినన్ని లభించకపోవడం, నకిలీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండంతో రైతులు వీటిని కొని మోసపోతున్నారు.

వీటి విక్రయాల్లో వాళ్లు పేరుగాంచిన కంపెనీల అసలును పోలిన అందమైన లేబుళ్లను ముద్రించి ఆకర్ష ణీయమైన ప్యాకింగ్ లతో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. సాధారణంగా ఏ విత్తనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందో ఆ విత్తనాలకు సంబంధించే నకిలీ విత్తనాలు పుట్టు కొస్తుంటాయి. కొంతమంది ఆర్గనైజర్లు, దళారులు కుమ్మకై ఉత్పత్తి చేస్తున్న నకిలీలో సింహభాగం పత్తి విత్తనం కావడం గమనార్హం. ఉదాహరణకు ఒక ఎకరాలో పత్తి సాగుకు ఏకంగా రూ.1,500 విలువైన విత్తనాలను విత్తాల్సి ఉంటోంది.ఈ కారణంగానే ఈ పంటకు సంబంధించి తక్కువ ధరతో నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. రైతులు కూడాఎప్పటికప్పుడు ధర తక్కువగా ఉంది కదా అని వాటినే కొనుగోలు చేస్తూ దిగుబడి రాక మోసపోతున్నారు. ఈ సారి పత్తి సాగు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలు ఉత్పత్తి ముఠాలు, కొంత మంది వ్యాపారులు సన్నాహాలు చేసుకునే క్రమంలో పోలీసులకు అడ్డంగా పట్టు పడుతుండడం విశేషం.

కర్నూలు జిల్లాలో పత్తిని ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో సాగు చేస్తారు. గతేడాది దాదాపు 3 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా, ఈ ఏడాది అదే స్థాయిలో పత్తి సాగు అయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.జిల్లాకు 15 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరంగా గుర్తించగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పత్తి మొక్కజొన్న, మిర్చి నూటికి నూరు శాతం ప్రయివేట్ కంపెనీలే సమకూర్చుతున్నాయి. ఇక కంది, వరిలో 50 శాతం కూడా ప్రయివేట్ విత్తనమే. ఇవన్నీ కూడాచట్టం పరిధిలోకి రావు. ఇదే సమయంలో విత్తు కొరత, అధిక ధరలు నకిలీ విత్తన విక్రయాలకు తెర లేపుతున్నాయి. చిన్నాపెద్దా కంపెనీలు నాసీరకం విత్తనాలు విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీటికి సంబంధించి జిల్లాలో 150 మంది వరకు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. రైతులకు, కంపెనీలకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తూ కొందరు ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులు కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు.
ఇవేమీ తెలియని రైతులు నకిలీ విత్తనాలు వినియోగించి పంట ఉత్పత్తులు రాగా నిండా మునిగిపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు.గతంలో జిల్లాలో దాదాపు 10 కంపెనీలపై అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకున్నారు. 10 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. ఒక విత్తన డీలర్ ఒక సాధారణ పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ.25 నుంచి రూ.30 ల వరకు లాభం వస్తుంది. అదే బీటీ -3 విత్తన ప్యాకెటు విక్రయిస్తే రూ.500, లూజ్ విక్రయిస్తే కిలోకు రూ. వెయ్యి చొప్పున మిగులుతాయి. ఈ క్రమంలోనే నకిలీ విత్తన వ్యవహారానికి తెర తీస్తూ అనేక ముఠాలు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.